ప్లాస్టిక్ రహితంగా కుంభమేళాగా జరుపుకోవాలి
యూపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తానూ పాల్గొంటాను
: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః దేశం నుంచే కాకుండా పలు ఇతర దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పాల్గొనే కుంభమేళాలో భక్తుల కోసం కేంద్ర తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈసారి కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతుందని చెప్పారు.
దాదాపు 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తాను కూడా కుంభమేళాలో పాల్గొంటున్నానని తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ రహితంగా కుంభమేళాను జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో మహా కుంభమేళా ఒకటని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుందని తెలిపారు. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా కుంభ మేళా లు జరుగుతున్నాయని తెలిపారు. సాధారణ ప్రజలతో పాటు వేలాది మంది సాధు సంతులు ఈ కుంభ మేళాలో పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున హిందువులు ఈ కుంభ మేళాలో పుణ్య స్థానాలు చేయడాన్ని పవిత్ర మైన రోజులు గా హిందువులు భావిస్తారన్నారు. ఆరు పుణ్య దినాల్లో గంగానదిలో చేయాలని చెబుతారని, అవి జనవరి 13,14,29, ఫిబ్రవరి 3,12,26 తేదీల్లో మంచి రోజులు అని చెప్పారు. తెలంగాణ నుండి భారీగా భక్తులు పాల్గొని పుణ్య స్నానం ఆచరిస్తారని అన్నారు. ప్రయాగ్ ఘాట్లో స్నానం చేస్తే ఎంతో మంచిదని భక్తులు విశ్వసిస్తారని చెప్పారు.