Friday, November 22, 2024

హేమ కమిటీ నివేదికపై ప్రత్యేక ధర్మాసనం: కేరళ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

కోచ్చి: జస్టిస్ హేమ కమిటీ నివేదికకు సంబంధించిన కేసులపై విచారణ జరిపేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ హైకోర్టు గురువారం తెలిపింది. హేమ కమిటీ నివేదికను విడుదల చేయడానికి అనుమతిస్తూ ఏకసభ్య ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ ఎస్ మను మదేతో కూడిన ధర్మాసనం ఈ మౌఖిక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక ధర్మాసనంలో మహిళా న్యాయమూర్తులు కూడా ఉంటారని హైకోర్టు తెలిపింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి అనుమతిస్తూ కేరళ సమాచార కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఆగస్టు 13న కొట్టివేసిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నివేదిక విడుదలకు అనుమతించింది.

2017లో ఒక మలయాళ నటిపై లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని నియమించింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దోపిడీ జరుగుతున్న విషయాన్ని కమిటీ తన నివేదికలో ఉదాహరణలతోసహా బయటపెట్టడం సంచలనం సృష్టించింది. నివేదిక వెలుగుచూసిన దరిమిలా పలువురు నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెట్టగా పలువురు ప్రముఖ నటులు, దర్శకలు, నిర్మాతలపై కేసులు నమోదయ్యాయి. కాగా..ఈ ఫిర్యాదులను దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు ఆగస్టు 25న కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News