నిజామాబాద్ ః ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవారు ఎంతటి వారైనా కొరడా ఝుళిపిస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే డిజిపి అంజనీకుమార్ మీదే కమిషన్ వేటు వేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్పెషల్ బ్రాంచ్‌లో ఆయనో కిందిస్థాయి అధికారి. ఎన్నికల కమిషన్ కళ్లుగప్పి పనిచేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అసలు ఆ అధికారి విషయంలో ఉన్నతాధికారులు రూల్స్ సైతం బ్రేక్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంత జిల్లాకు చెందిన ఎస్‌ఐలు, తహసీల్దార్లను పొరుగు జిల్లాకు బదిలీ చేయడం అనివార్యం. ఈ బదిలీల విషయంలో ఎన్నికల కమిషన్ నిక్కచ్చింగా వ్యవహరిస్తుంది. అందుకే వారిచ్చిన గడువులోగానే రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. పోలీసు శాఖలో ఎస్‌ఐ స్థాయి అధికారులందరినీ బాసర్ జోన్ పరిధిలో నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాకు దాదాపు 24 మందికి పైగా బదిలీ అయ్యారు.
వారి స్థానంలో ఆయా జిల్లాల నుంచి అంతేమంది జిల్లాకు వచ్చారు. ఈ బదిలీలో భాగంగానే నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న ఓ అధికారికి సైతం ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. కానీ అప్పటి నిర్మల్ జిల్లా ఎస్‌పి ప్రవీణ్ రెడ్డి డిఐజిగా అదనపు బాధ్యతల్లో ఉండడంతో సదరు ఎస్‌ఐ ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాకు డిప్యూటేషన్ వేయించుకున్నారు. అంతటితో ఆగకుండా యధావిధిగా నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు వచ్చేశాడు. ఈ ఎస్‌ఐ ఈ విభాగంలోనే ఏళ్ల తరబడిగా పాతుకుపోయి పనిచేస్తున్నాడు. గతంలో కమిషనర్‌గా పనిచేసిన నాగరాజ్ హయాంలో సదరు ఎస్సై అన్ని వ్యవహరాల్లో తానే చక్రం తిప్పేది. నిజానికి సదరు అధికారి జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఏళ్ల తరబడిగా పనిచేయడం వల్ల ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలతోనూ సాన్నిహిత్యం ఉంది. అందుకే ఎస్‌బిలో కాకుండా ఆయన మరెక్కడా పనిచేయడానికి ఆసక్తి చూపరనే వాదన ఉంది. ఎసిపితో పాటు ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్‌ఐలుండే స్పెషల్ బ్రాంచ్‌లో కీలక వ్యవహారాలన్నీ సదరు ఎస్‌ఐ కేంద్రంగానే సాగుతాయనే పేరుంది.
నిజానికి ఎన్నికల కమిషన్ ఒక్కసారి బదిలీల జాబితాకు ఆమోద ముద్ర వేశాకా ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా చర్యలు కఠినంగానే ఉంటాయి. ఆ తర్వాత ఏ చిన్న మార్పులు చేర్పులు చేసినా ఎన్నికల అధికారుల అనుమతి అనివార్యం. ఇలాంటివి అసాధారణ పరిస్థితుల్లో చేస్తారు. కానీ స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు అంత ఔదార్యం చూపించారనే పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.