హైదరాబాద్: పారదర్శకత ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమీషనర్ రోనాల్ రోస్ తెలిపారు. ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్ల నిండిన వారితో పాటు ఓటర్ జాబితాలో పేరు లేని వారు, 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటరు నమోదుకు అర్హులని కమిషనర్ తెలిపారు. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా మీ సమీపంలోని పోలింగ్ బూత్ లో బిఎల్‌ఓ వద్ద ఉంటుందని, జాబితాలో మీ పేరు ఉందో లేదో, ఉన్నా ఏమైనా తప్పులు ఉన్న అక్కడి కక్కడే పరిష్కరించుకోవచ్చు అన్నారు.
నూతన ఓటరు నమోదు, ఫారం-6 ద్వారా, ఓటరు జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం-8 ద్వారా ఆప్ లైన్ అయితే మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ అధికారి ఈ నెల 26, 27 తేదీల్లో వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో https://voters.eci.gov.in లేదా voter helpline మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఫారం-6 ను నింపి నూతన ఓటరుగా నమోదు, ఫారం-8 ద్వారా ఓటరు జాబితాలో సవరణలు చేసుకోవచ్చన్నారు.
ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా బిఎల్‌ఓ లు వారి వారి పోలింగ్ స్టేషన్‌ల్లో తప్పని సరిగా అందుబాటులో ఉండడమే కాకుండా అవసరమైన ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి గైర్హాజరైతే క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం ఈ ఆర్ ఓలను ఆదేశించారు. పూర్తి వివరాలకు, ఇతర సందేహాలకు ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసికమీషనర్ రోనాల్ రోస్ తెలిపారు.