మదనపురం: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు రాజ్యాంగం కల్పిస్తున్న ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల తహసిల్దార్ నరేందర్ తెలిపారు. ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశానుసారం సిబ్బందితో కలిసి మదనపురం మండల కేంద్రంతో పాటు కొన్నూరు, దుప్పల్లి, కర్వేనగోపన్ పేట గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఓటు నమోదు చేస్తున్న బిఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 26, 27 తేదిలలో అన్ని గ్రామాల్లో ఓటు నమోదు స్పెషల్ క్యాంపులు నిర్వహించారని, ఆదివారం మండలంలోని అన్ని గ్రామాలలో ఓటు నమోదు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు.
కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న యువత ఫారం 6ను పూర్తి చేసి అవసరమైన ధృవపత్రాలను జత చేయాలన్నారు. ఓటరు కార్డులో సవరణలకు సైతం ఎన్నికల కమీషన్ అవకాశం కల్పించిందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 వరకు గడువు ఉందన్నారు. మండలంలోని 29 పోలింగ్ కేంద్రాల్లో శనివారం 70 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహసిల్దార్ అశోక్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ భాస్కర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి, ఆయా గ్రామాల బిఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.