Wednesday, January 15, 2025

సింగరేణి కార్మికులకు నిమ్స్‌లో ప్రత్యేక కౌంటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల కోసం హైదరాబాద్ లోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఈ కౌంటర్లను నిమ్స్ డైరక్టర్ బీరప్ప, సింగరేణి డైరక్టర్ (ఫైనాన్స్, పర్సనల్ ) ఎన్.బలరామ్ ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవల కోసం సింగరేణి రిఫర్ చేయబడిన సింగరేణి కార్మికులు, సిపిఆర్‌ఎంఎస్ మెడికల్‌కార్డులు ఉన్న విశ్రాంత కార్మికులు అడ్మిషన్ కౌంటర్ల వద్ద మిగిలిన రోగులతో పాటు క్యూ లో ఎక్కువ సేపు వేచి చూసే అవసరం లేకుండా నేరుగా డాక్టర్లను సంప్రదించేందుకు, అడ్మిట్ అయ్యేందుకు ఈ ప్రత్యేక సింగరేణి కౌంటర్లను తెరిచినట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు.

సింగరేణి విస్తరించిన సుదూర ప్రాంతాల నుంచి వైద్య సేవలకు వస్తున్న కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగరేణి ఉద్యోగులు అంటే మాఉద్యోగులు అనే భావనతో సేవలు అందిస్తున్నామన్నారు.నిమ్స్ ఆసుపత్రిలో అన్ని వైద్య విభాగాలలో ఆధునిక వైద్య సేవలు అందించడం కోసం అత్యాధునిక వైద్య సేవల యంత్రాలను సమకూర్చుకున్నామని, అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలందిస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్ .బలరామ్ మాట్లాడుతూ నిమ్స్ వారు సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం పట్ల హర్షం ప్రకటించారు. అలాగే నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి సహాయకుల తాత్కాలిక వసతి కోసం ప్రత్యేక బిల్డింగును కేటాయించడం కూడా సంతోషకరమన్నారు. దీనిని త్వరలోనే వసతికి అనుకూలంగా మార్చుతామన్నారు. ఇతర ఆసుపత్రులతో పోల్చినట్లయితే నిమ్స్ లో అతి తక్కువ రేటుతో అన్ని రకాల వైద్య సేవలను విశేష ఆనుభవం గల వైద్య నిపుణుల ద్వారా అందిస్తున్నారని, కనుక నిమ్స్ వైద్య సేవలను ఉద్యోగులు ఎంపిక చేసుకుని మెరుగైన వైద్య సేవలు పొందాలన్నారు.

ఈ సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిలోని అన్ని విభాగాలను అక్కడ గల ఆధునిక వైద్య సేవలను నిమ్స్ డైరెక్టర్ బీరప్ప డైరెక్టర్ ఫైనాన్సు ఎన్.బలరామ్ కు ,జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం సురేష్ కు వివరించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి డిప్యూటీ సీఎంవో డాక్టర్ బాలకోటయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సింగరేణి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, సింగరేణి పీఆర్వో ఎస్.శ్రీకాంత్, డీఎంఎస్ లు డాక్టర్ కె వి కృష్ణా రెడ్డి , డాక్టర్ లక్ష్మీ భాస్కర్, ఆర్థిక విభాగం అధికారులు శ్రీధర్,వెంకటేశ్వర రావు, సూపరింటెండెంట్ మోహన్, పీఆర్వో శ్రీమతి లక్ష్మి, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

NIMS counter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News