కృష్ణా జలాల్లో అదే నిష్పత్తికి అంగీకరించం
కెఆర్‌ఎంబి నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదు
జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దండి
గోదావరి జలాల్లో 493 టిఎంసిలకే ఎపిని కట్టడి చేయండి
ఇతర బేసిన్లకు నీటి తరలింపును అడ్డుకోవాలి
కేంద్రానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక సిఎస్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు తాగునీటికి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కృష్ణాజలాల్లో 574 టిఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తిశాఖను కోరింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మంగళవారం నాడు కేంద్ర జల్‌శక్తిశాఖకు లేఖ రాశారు. ఎపి పునర్ విభజన చట్టం మేరకు 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. కృష్ణానదీజలాల్లో తెలంగాణకు సమాన నీటి వా టా కావాలని రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే కోరు తూ వస్తున్నట్టు తెలిపారు. కేంద్ర నీటిపారుదలశా ఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సమాన నీటివాటా అంశాన్ని చర్చకు పెట్టారని తెలిపారు. నదీజలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలనికోరారు. అందుకోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌నే ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చామన్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని ,అయితే సుప్రీంకోర్టులో కేసును విత్‌డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రప్రభుత్వం హామీ మేరకు 2021లో కేసును ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.
కృష్ణానదీజలాల వినియోగానికి సంబంధించి 2015లో తెలంగాణకు 299, ఏపికి 512టిఎంసీల వాట ప్రకారం తాత్కాలిక ఒప్పందం జరిగిందన్నారు. అయితే ఈ ఒప్పదం ఆ ఏడాదికి మాత్రమే అంగికరించామని గుర్తు చేశారు. కృష్ణానదీయాజమాన్యబోర్డు విభజన చట్టం నిబంధనలకు విరుద్దంగా ,ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. 2021-22లో కూడా తాత్కాలిక నీటి ఒప్పందాన్నే కొనసాగించిందన్నారు. గత నెల జరిగిన 16వ కృష్ణాబోర్డు సమావేశంలో కూడా తాము 50శాతం నీటివాటా కావాలని గట్టిగా డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలో 2022-23నీటి సంవత్సరానికి సంబంధించి 105టీఎంసీలు అవసరం ఉందన్నారు.ఇందులో ఎస్‌ఎల్‌బిసి,నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిధిలో పదినుంచి 12లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సివుందన్నారు. పాత పథకాలతోపాటు ,తాగునీటి అవసరాలు కూడా పెరిగాయన్నారు. వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి 574టిఎంసీల నీటికి కేటాంచాలని లేఖ ద్వారా కేంద్ర జల్ శక్తిశాఖనుకోరారు.
గోదావరి జలాల్లో 493టిఎంసిలకు ఎపిని కట్టడి చేయండి
గోదావరి నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 493టిఎంసీలకు కట్టడి చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు రాష్ట్రప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఎపిలో గోదావరినదీజలాల వినియోగంపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేంద్ర జల్‌శక్తిశాఖకు మంగళవారం లేఖ రాశారు. 1980లో గోదావరివాటర్‌డిస్పూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు మేరకు నీటి వినియోగం జరగాలన్నారు. గోదావరినదిపైన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని రోజుకు 1.7టిఎంసీల నీటిని డ్రా చేసుకునేవిధంగా కుడి , ఎడమ కాల్వలు నిర్మిస్తున్నారని తెలిపారు. మొత్తం 448.78టిఎంసీల నీటిని వినియోగించుకోవాల్సివుండగా , 449టిఎంసీలకంటే అధికంగా నీటిని వినియోగించుకునే విధంగా పనులు చేస్తున్నారన్నారు. ఇది ఎపికి ఎగువన ఉన్న తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.
ఎపి ప్రభుత్వం గోదావరి నదీజలాలను అధికంగా ఉపయోగించుకునేందుకు ఇప్పటికే పలు ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించినట్టు తెలిపారు.వాటిలో పుష్కర ఎత్తిపోతల ద్వారా 11.8టిఎంసీలు, చాగల్నాడు ద్వారా 2.85టిఎంసిలు, తొర్రిగడ్డ ద్వారా 2.41టిఎంసీలు, తాడిపూడి ద్వారా 14.47టిఎంసీలు, పట్టిసీమ ద్వారా 80టిఎంసీలు వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలన్నారు. ఏపి ప్రభుత్వం వెంకటనగరం ద్వారా 3.62టిఎంసీలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి (పురుశోత్తమ పట్నం) ద్వారా 63.2టిఎంసీలు, చింతలపూడి ద్వారా 33టిఎంసీల నీటిని ఉపయోగించుకుంటోందని తెలిపారు. గోదావరి జలాలను బయటి బేసిన్‌కు తరలించేప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.వరదల సమయాల్లో వదరనీరు ,మిగులు నీటిని గోదావరిపెన్నా లింకింగ్ ద్వారా 350టిఎంసీలను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకుపోయారు. ఎపి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల ద్వారా ఆ ప్రభావం ఎగువ రాష్ట్రాలపై పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని గోదావరి జలాల్లో 493టిఎంసీల నీకర జలాలకు ఏపిని కట్టిడి చేయాలని రజత్ కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖను లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.