Saturday, January 18, 2025

రాజ్యాంగంపై చర్చ.. దూషణలతో రచ్చ

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం అవతరించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లోక్‌సభలో రాజ్యాంగంపైనే ప్రత్యేక చర్చ గత మూడు రోజులుగా జరుగుతోంది. ఈ చర్చ ప్రధాన లక్షం రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాల అసలు లక్షాలు, ఆచరణ తీరు ఎలా ఉందో సమీక్షించడం. అంతేకాదు రాజ్యాంగంలోని లోపాలను గుర్తించడానికి తులనాత్మకంగా ప్రయత్నిస్తే ముందుకు వెళ్లే మార్గంలో సాధారణ ఏకాభిప్రాయం ఏర్పడుతుందని రాజకీయ మేధావులు భావించారు. కానీ దీనికి బదులు పరస్పరం ఒకరినొకదు దూషించుకోవడానికే ఈ చర్చ పరిమితమవుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఎంతో నష్టం చేసిందని తన స్వప్రయోజాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించిందని ప్రధాని మోడీ నుంచి మిగతా అగ్రనాయకులంతా పదేపదే తూర్పారపడుతున్నారు.

దీనికి కౌంటర్‌గా లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మనుస్మృతి ధర్మాలకు అనుగుణంగా మార్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతోందని గట్టిగా తన వాదన వినిపించారు. అయితే ప్రధాని మోడీ వాదన ఏకపక్షంగా ఉంటోంది తప్ప తమ నేతృత్వంలో జరుగుతున్న లోపాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. పైగా దేశానికి ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, తరువాత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశాన్ని నాశనం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో చారిత్రక వాస్తవాలు వక్రీకరణకు గురవుతున్నాయి. నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాలంలో ఏయే విధానాలు అమలయ్యాయో ఒకసారి సమీక్షించుకుందాం. నెహ్రూ పాలనలో కుల, మత, లింగ భేదాలకు, అంటరానితనానికి అతీతంగా ప్రాథమిక హక్కులు కల్పించడమైంది. మతసహనాన్ని, లౌకిక వాదాన్ని సమర్థించారు. భావప్రకటన స్వేచ్ఛకు, సంఘాల ఏర్పాటుకు వీలు కల్పించారు.

సామాజిక ఆర్థిక సమానత్వం ప్రతిబింబించింది. దేశ గతిని శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక పథం వైపు తీసుకెళ్లడానికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన ఆధునిక భారత దేశ వాస్తుశిల్పిగా, నవ భారత నిర్మాతగా చరిత్రకెక్కారు. అంతరిక్ష పరిశోధనల కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), అణువిద్యుత్ పరిశోధనలు వంటి వాటికి పునాది పడింది. భాక్రానంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ వంటి భారీ ప్రాజెక్టులు అవతరించాయి. రష్యా దేశ సాయంతో భిలాయి, రూర్కెలా ఉక్కు ఫ్యాక్టరీలు నెలకొన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల, పారిశ్రామిక రంగాలకు ఎంతో మేలు జరిగింది. విశ్వవిద్యాలయాలు విస్తరించాయి.

పంచవర్ష ప్రణాళికలను 1951 లోనే ప్రారంభించి దేశ పాలనా విధానంలో ఒక క్రమ పద్ధతిని తీసుకొచ్చారు. 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ ఏర్పాటు ద్వారా ఎన్నికల్లో ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించారు. విదేశాంగ విధానం, అలీనోద్యమ విధానంలోనూ నెహ్రూ అవలంబించిన విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నెహ్రూ పంచశీల ఒప్పందం భారత్ చైనా సంబంధాలను మెరుగుపర్చింది. ఇక ఇందిరా గాంధీ హయాంలో మైనారిటీలకు, బడుగువర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలయ్యాయి. బ్యాంకుల జాతీయం వంటి సాహసోపేత విధానాలు ప్రశంసలు అందుకున్నాయి. ఇందిర అంటే ఇండియా అన్న ఖ్యాతి లభించింది. అయితే ఎమర్జెనీ విధింపు ఆమె పాలనకు తీరని కళంకం తెచ్చింది.

ప్రతిపక్ష ప్రజానాయకుల నిర్బంధం, భావస్వేచ్ఛకు సంకెళ్లు పడడం, పత్రికల గొంతునొక్కడం ఇవన్నీ ఇప్పటికీ భయంకర సత్యాలుగానే మిగిలాయి. రాజీవ్ గాంధీ కూడా దేశానికి తీరని నష్టం కలిగించారని మోడీ ప్రకటించడం వాస్తవాలకు దూరమైన విమర్శ. ఆధునిక భారత దేశానికి రాజీవ్ పునాది వేశారు. 1984 నుంచి 1989 వరకు తన పాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం రివల్యూషన్ వంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి 1986లో మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్‌ఎల్) స్థాపించారు. దీంతో గ్రామాల వరకు పబ్లిక్ కాల్ ఆఫీస్ (పిసిఒ) విస్తరించింది. డిజిటల్ ఇండియా ఆర్కిటెక్ట్ అని పేరుపొందారు. పట్టణాలు, గ్రామాల్లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ విస్తరింపచేశారు. సైన్స్, టెక్నాలజీ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించారు. ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించగలిగారు. ఉన్నత విద్యా కార్యక్రమాల ఆధునీకరణకు 1986లో జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌పిఇ) అమలులోకి తెచ్చారు.

ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే. అయినా నెహ్రూ, ఇందిర, రాజీవ్ వల్లనే దేశం తీరని నష్టాల పాలైందని ప్రధాని మోడీ వ్యక్తిగతంగా విద్వేషం ప్రకటించడం చర్చను పక్కతోవ పట్టించడమే. పార్లమెంట్‌లో తన మంద బలాన్ని అండచేసుకుని విపక్షాల గొంతునొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ఎలాంటి నియంతృత్వ, నిర్బంధ విధానాలు సాగాయో అంతకన్నా ఎక్కువ నిర్బంధాలు ప్రస్తుత మోడీ రాజ్యంలో కొనసాగుతున్నాయన్నది విస్మరించరాదు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, వారిని జైళ్లకు పంపించడం, బిజెపియేతర రాష్ట్రాలపై వివక్ష చూపడం, మణిపూర్ హింసాకాండ, రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం ఇవన్నీ నేటిసాక్షాలు.

వీటిని విస్మరించి గత ప్రభుత్వ పాలనలోని లోపాలను ఏకరువుపెట్టినందువల్ల వచ్చిన ప్రయోజనమేదీ లేదు. పరమత విద్వేషం పేట్రేగుతోంది. అంతా ఆర్‌ఎస్‌ఎస్ మూలాల హిందుత్వ భావజాలమే. ప్రార్థనా స్థలాల పరిరక్షణ కాగితాలకే పరిమితమైంది. రాజ్యాంగంలో ప్రజల హక్కులకు కల్పించిన హామీలకు ఇంకా సరైన భరోసా లభించడం లేదు. రాజ్యాంగం పవిత్రమైన డాక్యుమెంట్ అని ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప రాజ్యాంగ సవరణలలోని లోపాలపై సరైన చర్చ జరగడం లేదు. ఇలా నిలదీయడానికి నిజాయితీతో కూడిన ఆత్మపరిశీలన అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News