Friday, November 22, 2024

రాష్ట్రంలో ‘గంజాయి’పై స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -
Special drive on marijuana in Telangana
అన్ని జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి సరఫరా, వినియోగదారులపై ఉక్కుపాదం మోపాలకు అన్ని జిల్లాల ఎస్‌పిలకు పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు. ఈక్రమంలో ఆయా జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులతో పోలీసు అధికారులు కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి రాకెట్స్‌లను సమూలంగా తుడిచిపెట్టేందుకు డ్రగ్స్ వినియోగదారులపై కేసులు నమోదు చేసి కఠిన చట్టాలను ప్రయోగించాలని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా చేస్తున్న వారిపై ఎన్‌డిపిఎస్ 1985 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు పిడి యాక్ట్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు సూచిస్తున్నారు. అదేవిధంగా గంజాయి దందా నిర్వహించే వారిపై, వాటి రవాణాకు ఉపయోగిస్తున్న మార్గాలపై మరింత నిఘా సారించనున్నారు.

ఇటీవల కాలంలో గంజాయి తదితర మత్తు పదార్థాలను వినియోగించిన వారు వివిథ నేరాలలో పట్టుబడటంతో ఈ విషయంపై పోలీసు బాసులు సీరియస్‌గా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గంజాయి సరఫరా కేసులో జైలుకు వెళ్లిన నిందితులకు సంబంధించిన ములాఖత్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించాలన్న ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మత్తు పదార్థాల కేసులో పట్టుబడిన వారు జైల్లో మరికొందరితో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా గంజాయిని చాక్లెట్ల, ట్యాబ్లెట్ల, లిక్విడ్ రూపంలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వారిపై మరింత నిఘా సారించనున్నారు. ఇటీవలనే సూర్యాపేటకు చెందిన ఆంగోతు నాగరాజు, ధరావత్ సతీష్‌లు కలిసి మహారాష్ట్రకు 98 కేజీల గంజాయి తరలిస్తూ కూనవరం రోడ్డు సిఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో పట్టుబడ్డారు. కారు డిక్కీలో 98కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు రెండో నంబరు ఫ్లాట్ ఫాం పై నూ 60 కిలోల గంజాయి వదిలి వెళ్లారు.

విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు 11 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తున్న క్రమంలో సిరిసిల్ల బైపాస్ సమీపంలో పోలీసులు తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని పెద్దపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దేవగర్ క్యాంపు వద్ద 150 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు గంజాయిని మహారాష్ట్ర తరలిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డ్రగ్స్ విక్రేతలపై ఉక్కుపాదం మోపడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త వ్యూహాలకు తెరతీస్తుండటం గమనార్హం. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిపైనే కాకుండా డ్రగ్స్ కొనుగోలు చేసే వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన వారిపై పిడి యాక్ట్ నమోదు చేసేందుకు పోలీసు బాసులు సమాలోచనలు సాగిస్తున్నారు. నగరాన్ని మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఇకపై డ్రగ్స్ రవాణా, వినియోగదారులపై కఠినమైన చట్టాలను ప్రయోగించేందుకు ఇటు పోలీసు, అటు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News