Friday, November 15, 2024

టిఆర్‌నగర్ అభివృద్ధికి ప్రత్యేక కృషి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: నిరుపేద వర్గాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల పట్టణ టిఆర్‌నగర్ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. టిఆర్‌నగర్‌లో రూ.55 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు, మురికి కాల్వల పనులను ఎమ్మెల్యే సంజయ్ స్థానిక నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగిత్యాల పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం ఎన్‌టిఆర్ హాయాంలో అప్పటి ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు అందించిందన్నారు. జిఓ 58 కింద ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతో ఇటీవల 58 మందికి ఇళ్ల పట్టాలు అందించడం జరిగిందన్నారు. టిఆర్‌నగర్‌లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే వృద్దాశ్రమం, బాల సదన్, బస్తీ దవాఖానా, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేశామన్నారు.

టిఆర్‌నగర్‌లో చేపడుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా, త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీకి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. టిఆర్‌నగర్‌లో 160 మందికి డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

అభివృద్ది, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. జగిత్యాల అభివృద్దికి అప్పటి ఎంపి కవిత ఎంతగానో కృషి చేశారని, ఆమె వల్లే జగిత్యాలకు 4500 డబుల్ ఇండ్లు వచ్చాయన్నారు. అభివృద్దే ధ్యేయంగా పని చేసిన కవితను ఓడించేందుకు బిజెపి, కాంగ్రెస్ నేతలు కుమ్ముక్కై కుట్ర చేశారన్నారు. కవితక్కను ఓడించి గెలిచిన బిజెపి ఎంపి కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పదవి పట్టుకుని వేలాడుతున్నాడే తప్పా చేసిందేమి లేదన్నారు.

కేంద్రం తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నా, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాన్ని విస్మరించకుండా కోట్లాది నిధులు ఖర్చు చేస్తోందన్నారు. గత పాలనకు, కెసిఆర్ పాలనకు ఎంత తేడా ఉందో ఈ తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ది పనులు స్పష్టం చేస్తున్నాయన్నారు.

అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, వారిని నమ్మితే నట్టేట ముంచుతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ చాంద్‌పాషా, డిఇ రాజేశ్వర్, నాయకులు కొండ శ్రీనివాస్, సుమన్, బాబాగౌడ్, విఘ్నేష్, కృష్ణమూర్తి, సురేశ్, సాయికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News