Wednesday, November 6, 2024

గురుకుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

Special focus on Gurukul students: Minister Satyavathi Rathod

హైదరాబాద్ : గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సంక్షేమ భవన్‌లో శుక్రవారం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నూతన విద్యా సంవ్సరం ప్రారంభం కావడంతో గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరడం పై సంతోషం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో ఒక విద్యార్థి అనారోగ్యంతో, మరొక విద్యార్థి పురుగుల మందు సేవించి మరణించిన ఘటనలపై మంత్రి అధికారులపై సీరియస్ అయ్యారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుండి వస్తున్న విద్యార్థుల ఆరోగ్య, మానసిక పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టాలని, విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించాలని సూచించారు.

అనారోగ్య సమస్యలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ ఏడాది ఇంగ్లీషు మీడియం ప్రవేశ పె ట్టడంతో ఆశ్రమ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మరింత వెరుగైన విద్యను అందించే దిశగా కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందవలసిన యూనిఫాం, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర సౌకర్యాలు అన్ని సత్వరమే కల్పించాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు వారికి మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పోడు భూముల సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే పరిష్కార దిశగా కృషి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

వర్షాకాలంలో రోడ్ల సమస్య ఏర్పడితే వెంటనే పరిష్కరించాలని, బిటి రోడ్ల మరమ్మత్తులు చేయడంతో పాటు లింకు రోడ్లు మంజూరు చేస్తామన్నారు. గిరి వికాస పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని, 3 ఫేస్ విద్యుత్తు అందే విధంగా చూడాలని కోరారు. తాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. బిఎఎస్ స్కీం కింద జిల్లా కేంద్రాల్లోని స్కూళ్ళలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయా స్కూళ్ళలో సరైన సదుపాయాలు ఉన్నాయా లేదా తనిఖీలు చేసి సరైన వసతులు కల్పించాలన్నారు. గిరి పోషణతో పాటు కెసిఆర్ న్యూట్రిషన్, బాలమృతం ఆదివాసులకు కూడా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, స్పెషల్ సెక్రటరి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్, జిఎం ట్రయికర్ శంకర్ రావు, లక్ష్మీ ప్రసాద్ ట్రైకార్ డిజి బిక్షపతి, రైటిడిఎ లు ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News