హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని టిఆర్ఎస్ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో బడ్జెట్ చర్చ జరిపిన సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులను వారి స్వస్థలాలకు సిఎం కెసిఆర్ పంపించారని ప్రశంసించారు. భవన కార్మికులు లేకుండా నిర్మాణ రంగాన్ని ఊహించలేమన్నారు. భవన నిర్మాణ కార్మికులకు లేబర్ డిపార్ట్ మెంట్ అనేక పథకాలను అందిస్తోందని, లేబర్ కార్డు ఉన్న కుటుంబంలో ఆడపిల్ల పుడితే పది వేల రూపాయలు ఇస్తున్నారని, మహిళ కూలీలు కాన్పుకు ఇరువై రూపాయలు అదనంగా ఇస్తున్నామని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగ కల్పనపై కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించిందన్నారు. ఇప్పటి లక్షా 34వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గ్రామీణ విద్యార్థులకు నైపుణ్యం లేకపోవడంతో మండల కేంద్రాలలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు. ఉపాధి కల్పన కోసం స్కిల్ డెవలప్‌మెంట్‌పై గ్రామీణ విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదివిన విద్యార్థులకు స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 16,492 మంది జర్నలిస్టులకు, 20 వేల మంది హోంగార్డ్స్‌కు లేబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు