Wednesday, January 22, 2025

పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి:  డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

ఐదు ఏండ్లుగా పునరుత్పాదక పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి నష్టం
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాట్లు
సాగునీటి జలాశయాలపై ఫ్లోటింగ్..సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు
ప్రజాభవన్‌లో టిఎస్ రెడ్కో అధికారులతో సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్ : మారుతున్న కాలమాన పరిస్థితులు, కేంద్రం ఇతర సంస్థల నుంచి అందుతున్న ఆర్ధిక సహయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై శుక్రవారం ప్రజాభవన్ లో టి.ఎస్ రెడ్కో అధికారులతో డిప్యూటి సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్యరహిత విద్యుత్తు ను ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదక విద్యుత్తు వనరులపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను అదేశించారు.

పునరుత్పాదక విద్యుత్తు పెంచుకునేందుకు బహిరంగ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జలాశయాలను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలు వెను వెంటనే సిద్దం చేయాలని అన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవసరమైన అన్ని శాఖలను భాగస్వాములుగా చేసి త్వరలోనే సమీక్ష చేస్తామన్నారు. గత ఐదు ఏండ్లుగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు పాలసీ లేకపోవడం మూలంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక పాలసీ లేకపోవడం మూలంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వినియోగించుకోలేకపోయామని, ఆయా కాలమాన పరిస్థితుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోయామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి రాష్ట్రంలో వాటిని విస్తృతంగా ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పవన విద్యత్తు ఉత్పత్తికి ఎంత మేరకు అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ రంగంలో ఏ మేరకు ఉత్పత్తి జరుగుతుందన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్తు సబ్ స్టేషన్లలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు ఏ మేరకు ఆదాయం సమకూరింది ? రాష్ట్రంలోని ఇతర సబ్ స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు, వాటిని తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి చర్చించారు.

రాష్ట్రంలో మన ఊరు, మన బడి కింద 1521 పాఠశాలలో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా వీటిలో ఎన్ని పాఠశాలల్లో ఇప్పటి వరకు సోలార్ రూఫ్ టాప్ పనులు పూర్తయ్యాయి ? ఎంత మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారన్న అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. టిఎస్ ఆర్‌టిసిలో , సోషల్ వెల్ఫేర్ సంస్థల్లో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ పని తీరు గురించి డిప్యూటి సిఎం భట్టి ఆరా తీశారు. భారీ, మధ్యతరహా సాగు నీటి జలా శయాల్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి చేసిన ప్రణాళికల్లో ప్రగతి లేకపోవడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. త్వరలో సాగునీటి శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజనులకు చేయూతను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పిఎం జనజాతి ఆదివాసీ సోలార్ ప్రాజెక్టు విశేషాలు, రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు అమలుకు అవకాశాలు.. ఫలితంగా గిరిజనులకు చేకూరే ప్రయోజనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పునరుత్పాదక విద్యుత్తు పాలసీని రాష్ట్రంలో తీసుకురావడానికి త్వరలో విద్యుత్తు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో టి.ఎస్ రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, సింగరేణి సంస్థల చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం, టి.ఎస్ రెడ్కో జనరల్ మేనేజర్ జిఎస్వి ప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్లు రామకృష్ణ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bhatti Vikramarka

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News