Friday, January 24, 2025

జగిత్యాల పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల పట్టణంలో మౌళిక వసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృషి సారించినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మన వార్డు… మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల పట్టణంలోని 6, 7 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వార్డుల సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆయా వార్డుల మహిళలు మంగళహరతులతో స్వాగతం పలికి నుదుట తిలకం దిద్దారు. ఎమ్మెల్యే వార్డుల్లో కలియ తిరుగుతూ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్షం వల్ల జగిత్యాల పట్టణం అభివృద్దికి నోచుకోక అస్తవ్యస్తంగా తయారైందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ అభివృద్దికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న జగిత్యాలను అన్ని విధాల అభివృద్ది చేయడంతో పాటు ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, ఇంటింటికి చెత్త బుట్టలను అందించి ఆటోల ద్వారా ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించడం జరుగుతోందన్నారు. గతంలో రూపొందించిన జోన్‌ల వల్ల పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, నూతన నిర్మాణాలు చేసుకునేందుకు మున్సిపల్ నుంచి అనుమతులు రాక, బ్యాంకు రుణాలు అందక పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు.

అనుమతులు లేకుండానే ఎక్కడికక్కడ నిర్మాణాలు జరపడం వల్ల రోడ్లు, మురికి కాల్వలు సరిగా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జోన్‌లు మార్పిడి చేయించామన్నారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్దిని కేవలం 9 ఏళ్లలో చేసి చూపించామన్నారు. జగిత్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రంలో ఉన్న బిజెపి కాపీ కొడుతోందన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు పొర్లు దండాలు పెట్టినా రాష్ట్రంలో వారికి స్థానం లేదని, ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది బిఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఆయా వార్డు కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News