అమరావతి: స్టాక్ పాయింట్లుగా ఉన్న బఫర్ గోదాముల్లో ఎఐ సిసి కెమెరాల ఏర్పాటు చేశామని ఎపి పౌరసరఫరా శాఖ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం పని చేస్తోందని అన్నారు. నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ.. 18 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసేలా గోదాములు ఉన్నాయని, ప్రైవేటు గోదాముల్లో జరుగుతున్న అవకతవకలు బయటపడ్డాయని చెప్పారు. మచిలీ పట్నంలోని జెఎస్ గోదాముల్లో స్టాక్ తగ్గిందని గుర్తించి, రూ. 1. 70 కోట్లు జరిమానా కూడా వేశామని తెలియజేశారు.
మరో రూ. 1.67 కోట్లు జరిమానా కట్టాలని నోటీసులు కూడా జారీ చేశామన్నారు. బేతంచర్లలోని గోదాములో 637 మెట్రిక్ టన్నుల సరకు తగ్గినట్టు గుర్తించామని వివరించారు. వీరందరిపైనా క్రిమినల్ కేసులతో పాటు బ్లాక్ లిస్టులోనూ పెట్టామని, పిడిఎస్ గోదాములపై పౌరసరఫరా శాఖ చాలా సంస్కరణలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతినెలా గోదాములను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామన్నారు. గతంలో పెద్ద ఎత్తున పిడిఎస్ బియ్యం అక్రమాలు జరిగాయని, వీటన్నిటిపైనా ప్రక్షాలన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.