ఆసిఫాబాద్ : జిల్లాలోని గ్రామాలలో పారిశుధ నిర్వహణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీదిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి జిల్లా ఆధికారులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటిసి అధికారులతో గ్రామపంచాయతీలలో పారిశుధ నిర్వహణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ పనులను పూర్తి స్థాయిలో చేపట్టి చెత్త రహిత గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. తడి చెత్త, పోడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరళించే విధంగా దృష్టి సారించాలని, ఇందుకు అవసరమైన వాహనాలను వినియోగించాలని అధికారులకు సూచించారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి పరిధిలోని గ్రామాల లో ప్రతి ఇంటికి వెళ్లి పారిశుధ నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్తలను నిలువ చేసే విధానం, పరిసర ప్రాంతాలలో పాటించే పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
పట్టణాలు, గ్రామాలలో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి వాటిలో ఉపయోగపడే చెత్తను వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించి కంపోస్టు ఎరువు తయారు చేసే విధంగా ఆధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఐటిసి సంస్థ వారితో ఒప్పందం కుదుర్చుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, ఐటిసి చీఫ్ మేనేజర్ ఉమాకాంత్, సభ్యులు సురేష్, సంజీత తదితరులు పాల్గొన్నారు.