కరోనా సంక్షోభం నుంచి తేరుకుంటున్న తరుణంలో భారత దేశ నగరాలకు విశేష ప్రాధాన్యం ఏర్పడబోతున్నదని అందుకనుగుణంగా వాటి పునర్నిర్మాణం కొత్త పుంతలు తొక్కాలని జెనీవా కేంద్రంగా పని చేస్తున్న ప్రపంచ ఆర్థిక వేదిక వెలిబుచ్చిన అభిప్రాయం ఎంతైనా సహేతుకమైనది, ఆచరించదగినది. వ్యవసాయం మినహా సకల ఆధునిక ఉత్పాదక కార్యకలాపాలు కేంద్రీకృతమైన భారతీయ నగరాలు కరోనా అనంతర పరిస్థితుల్లో వలసలను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతిని ఈ నివేదిక ప్రస్తావించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి నిమిషానికి 25 నుంచి 30 మంది నగరాలకు చేరుకుంటున్నారని వెల్లడించింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 70 శాతం నగరాల నుంచే ఉత్పన్నమవు తున్నందున ఈ వలసలు అనివార్యమని అందుకనుగుణంగా పురాల పునర్నిర్మాణం ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా జరగాలని సూచించింది. ఈ వలసల వల్ల మహా నగరాల్లో మురికి వాడలు పెరిగి, విస్తారమై ఆర్థిక వ్యత్యాసాలు కూడా తీవ్రతరమవుతున్నాయని తెలియజేసింది.
నగరాభివృద్ధికి సంబంధించి కాలదోషం పట్టిన వ్యూహాలకు స్వస్తి చెప్పాలని హితవు చెప్పింది. ముఖ్యంగా నాగరక రక్షణలతో కూడిన గృహ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరాన్ని నొక్కి పలికింది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నవీన దృష్టితో రూపకల్పన చేసి నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను గురించి ఈ సందర్భంలో ప్రస్తావించుకోవచ్చు. ఇటువంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తగినంతగా లభించితే మహా నగరాల్లో సాధారణ కార్మిక వర్గానికి, అసంఘటిత రంగ పని వారికి, పేద, దిగువ మధ్య తరగతి జనానికి సౌకర్యవంతమైన గృహ వసతి లభించి విశేష నగరీకరణ వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు తగ్గుతుంది. ఆరోగ్యకరమైన పరిసరాలు ఏర్పడతాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో మురికివాడల్లో నివసించే వారి సంఖ్య 2010తో ముగిసిన పదేళ్ల కాలంలో 50 శాతం పెరిగిందని, 62 శాతం నగర జనాభా ఆ వాడల్లోనే నివసిస్తున్నారని ఒక సర్వే నిగ్గు తేల్చింది. 2001లో ఒక కోటి 19లక్షలుగా ఉన్న ముంబై జనాభా 2010కి ఒక కోటి 43 లక్షలయింది. 2001లో అక్కడి మురికివాడల జనాభా 60 లక్షలుండగా, 2010కి 90 లక్షలకు చేరుకున్నది.
ఆ నగరంలోని ప్రతి ఐదుగురిలో ఇద్దరు మురికివాడల్లోనే నివసిస్తున్నారని ఏ రక్షణాలేని రేకుల షెడ్లలో అసంఖ్యాక జనం బతుకుతున్నారని గత నెలలో వెలువడిన ఒక సమాచారం తెలిపింది. ఇంచుమించు ప్రతి మహానగరం పరిస్థితి ఇదే. కొవిడ్ సంక్షోభం తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి నగరాలకు వలస వస్తున్న కార్మికులతో మురికివాడలు మరింతగా విస్తరించుకుంటాయని ప్రపంచ ఆర్థిక వేదిక చేసిన హెచ్చరికను గమనించి తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. గత ఏడాది మార్చిలో కరోనా విజృంభించిన సమాచారం తెలియగానే ప్రధాని మోడీ అవ్యవధిగా మూసివేత (లాక్‌డౌన్)ను ప్రకటించినందువల్ల చేయడానికి పని, తినతిండి, ఉండడానికి తల మీది కప్పు లేని దీనావస్థ ఎదురై లక్షలాది మంది నగర, పట్టణ కార్మికులు వందల వేల కి.మీ దూరంలోని స్వగ్రామాలకు మండుటెండల్లో కాలి నడకన నెత్తురోడుస్తూ ప్రయాణం చేసిన దయనీయ దృశ్యాలు కళ్లకు కట్టాయి. కేంద్రం నుంచి తగిన చేయూత కరవై వారు పడిన కష్టాలు చెప్పనలవికానివి. వారికి పని చేసే చోటనే సరైన గృహ వసతి ఉంటే ఆ తిరుగు వలసలు సంభవించి ఉండేవి కావు.
ఈ దారుణ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా నగరాల్లో గృహ వసతి కల్పనపై విశేషంగా దృష్టి పెట్టవలసిన బాధ్యత పాలకులపైనా, అభివృద్ధి వ్యూహకర్తలపైనా ఉంది. దేశ వ్యాప్తంగా 2 కోట్ల 50 లక్షల గృహస్థులు నగరాల్లో 35 శాతం కుటుంబాలు మార్కెట్ ధరకు ఇళ్లను కొనుక్కోలేని స్థితిలో ఉన్నారని ప్రపంచ ఆర్థిక నివేదిక తెలియజేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరాల్లో చౌక గృహ నిర్మాణానికి ప్రాధాన్యం పెంచవలసిన అవసరాన్ని గుర్తు చేసింది. కరోనా సంక్షోభం మొత్తమ్మీద వ్యత్యాసాలను పెంచడంతోపాటు స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక తేడాలను కూడా ఎక్కువ చేసిందని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రణాళికాబద్ధ అభివృద్ధి, గృహ నిర్మాణం, రవాణా, పర్యావరణం, ప్రజారోగ్యం, లింగపరమైన తేడాలు, కష్టనష్టాలకు తొందరగా దొరికిపోయే జనాభా అనే అంశాలపై భారత దేశ పరిస్థితులను లోతుగా పరిశీలించి ఈ నివేదికను తయారు చేసింది. ప్రణాళికబద్ధంగా, పద్ధతి ప్రకారం నిర్మాణమయ్యే నగరాలే వృద్ధి బాటలో దేశాన్ని పరుగులు తీయించగలవని చెప్పింది. అందుకనుగుణంగా నగర పాలక వ్యవస్థలను కూడా విప్లవీకరించాలని హితవు చెప్పింది. వీటిని గమనించి కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రాధాన్యాల్లో తగిన మార్పు తీసుకు రావలసిన అవసరం ఉంది.