Wednesday, January 22, 2025

ఈ నెల 22న దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి: విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌ను కలిసి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం వినతి పత్రం సమర్పించింది. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రారంభం బాల రాముడి ప్రాణప్రతిష్ట చేస్తున్న శుభ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మందిరం శుద్ధి చేసి, అందంగా ముస్తాబు చేయాలని వారు కోరారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట చేసే శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం వితరణ చేయాలని, అదేవిధంగా దేవాలయ కేంద్రంగా ఎల్‌ఈడీలు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయాలు తెరిచి ఉంచి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భక్తిశ్రద్ధలతో దీపారాధన నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా సర్కులర్ జారీ చేయాలని వారు కమిషనర్‌ను కోరారు.

ఈ సందర్భంగా కమిషనర్ అనిల్ వెంటనే రాష్ట్ర దేవాదాయ మంత్రికి సమాచారం అందించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు , బజరంగ్ దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News