పిటిషన్‌ను విజ్ఞప్తిగా పరిగణించండి
ఢిల్లీ అధికారులకు హైకోర్టు సూచన
న్యూఢిల్లీ: అంబులెన్సులు లాంటి అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకీ లేకుండా 24 గంటలు ప్రయాణించడానికి ప్రత్యేక మార్గాన్ని కేటాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విజ్ఞప్తిగా పరిగణించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వ అధికారులను కోరింది. ఈ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని, దీనికి సంబంధించి న్యాయస్థానం అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, న్యాయమూర్తి జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘రోడ్డు వెడల్పు, రోడ్డుపై ట్రాఫిక్‌పై ఇదంతా ఆధారపడి ఉంటుంది. పిటిషన్‌ను ఒక వినతిపత్రంలాగా పరిగణించి నిబంధనలు, చట్టం, కేసులోని వాప్తవాలకు వర్తించే పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ప్రతివాదులు (ఢిల్లీప్రభుత్వ అధికారులను) మేము ఆదేశిస్తున్నాం’అని బెంచ్ పేర్కొంటూ కేసు విచారణను ముగించింది.
వారంలో ఏడు రోజులు, రోజులో 24 గంటలు, ఎలాంటి ఆంక్షలు లేకుండా అత్యవసర వాహనాలు ప్రయాణించడం కోసం ఒక ప్రత్యేక లేన్‌ను కేటాయించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వ రవాణా అధికకారులను, ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ వినయ్ కుమార్ అనే వ్యక్తి అడ్వకేట్ అంకిత్ శర్మ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ప్రత్యేక లేన్‌ను కేటాయించడం వల్ల ప్రజలు త్వరగా ఆస్పత్రులకు చేరుకోవడానికి వీలవుతుందని, తద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని వినయ్ కుమార్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.