ఉత్తమ ప్రతిభ కనబర్చిన 618మంది పోలీసులకు ప్రత్యేక సేవా పతకాలు
ఏడుగురు మహోన్నత, 50 మంది కఠిన సేవా పతకాలకు ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్ : విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 618 మంది పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచే పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే, అత్యుత్తమ సర్వీసులు అందచేసిన పోలీసు అధికారులకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందచేస్తోంది. ఈక్రమంలో పోలీసు శాఖ, ఎసిబి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విపత్తు నిర్వహణ శాఖలకు కలిపి పతకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఏడుగురిని మహోన్నత సేవా, 50 మందిని కఠిన సేవా, 90 మందిని ఉత్తమ సేవా, 47 మందిని సేవా పతకాలకు ఎంపిక చేసింది. రాష్ట్ర పోలీసు శాఖ నుంచి వరంగల్ ఎఆర్ ఎస్‌ఐ ఎండి. షరీఫుద్దీన్, వరంగల్ ఏఆర్ ఎస్‌ఐ ఎల్. లింగారావు, వేములవాడ టౌన్ పౌలీస్ ఎస్‌ఐ పిల్లి రామచంద్రం, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ వరంగల్ 4వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రామాపురం వెంకటయ్య, కొండాపూర్ 8వ బెటాలియన్‌కి చెందిన జి. శామ్యూల్ రాజు, భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన పిడి క్రిస్టోఫర్‌లు మహోన్నత సేవా పురస్కారాలు దక్కించుకున్నారు.
అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 మంది, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 13 మందికి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదుగురు, సీఐడీ నుంచి ఆరుగురు ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు సర్కారు ప్రకటించింది. అదేవిధంగా ఎసిబిలోనూ ఉత్తమ, సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నలుగురు ఎసిబి అధికారులు ఉత్తమ సేవా పతకాలకు, పది మంది సేవా పతకాలకు ఎంపికైనట్లు స్పష్టం చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోనూ నలుగురికి ఉత్తమ సేవా, ముగ్గురికి సేవా పతకాలు ప్రకటించిన సర్కారు… విపత్తు నిర్వాహణ, ఫైర్ సర్వీసెస్ విభాగంలోనూ ముగ్గురికి ఉత్తమ సేవా, 14మందికి సేవా పతకాలను ప్రకటించింది. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఒకరికి మహోన్నత సేవ, ముగ్గురికి ఉత్తమ సేవ, 15మందికి సేవా పురస్కారాలు దక్కాయి.