బిసిలకు స్థానికసంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లకు
రెండు వేర్వేరు బిల్లులు ఎస్‌సి వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక
ఆధారంగా మరో బిల్లు త్వరలో కేబినెట్ భేటీ…ముసాయిదా బిల్లులకు
తుదిరూపు అసెంబ్లీ ఆమోదం తరువాత కేంద్రానికి మూడు బిల్లులు
మార్చి 10న అఖిలపక్షంతో హస్తినకు సిఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో
ఆమోదించిన కులగణన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలని
విజ్ఞప్తి చేయనున్న ముఖ్యమంత్రి ఈలోగా అన్ని పార్టీలకు లేఖలు
రాయాలని సిఎం నిర్ణయం మార్చి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనుంది. వాటిని బిల్లుల రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా బిసిలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ల బిల్లు. విద్య, ఉద్యోగా ల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన చట్టాల ను అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించనుంది. దీంతోపా టు ఎస్పీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారం గా ప్రభుత్వం మరో బిల్లును ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీ చర్చ, ఆమోదం తర్వాత ఎస్సీ వర్గీకరణ చట్టం రూపు దాల్చనుంది.
ఇలా ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మూడు వేర్వేరు బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బిసి రి జర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్ట బద్ధత కల్పిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికోసం మొత్తం మూడు బిల్లుల ముసాయిదాను అధికారులు రూప కల్పన చేస్తున్నారు. త్వరలోనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఈ ముసాయిదాలకు తుది రూపు ఇవ్వనున్నారు. అనంతరం వాటికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత మూడు చట్టాలను కేంద్ర ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది. వీటితో పాటు మార్చి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అఖిలపక్షంతో సిఎం ఢిల్లీకి
మార్చి 10వ తేదీన అఖిలపక్షంతో సిఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కులగణనపై అసెంబ్లీ తీర్మానం చేసి దానిని పార్లమెంట్ ఆమోదించాలని కోరుతూ అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆలోగా అన్ని రాజకీయ పార్టీలకు విధిగా లేఖలు రాయాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న కులగణనకు పరిష్కారం చూపించే దిశగా తమవంతుగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు దానిని పార్లమెంట్‌లో ఆమోదింపచేస్తామని ఇదివరకే సిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించే బాధ్యతను రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకే వదిలిపెడుతున్నామని ఇటీవల ముఖ్యమంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థలు
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థలు, ఎంపిటిసి, జెడ్పీటిసి, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిసిల, ఎస్సీల ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ వ్యూహాలను అమలు చేస్తోంది. దీంతోపాటు గతంలో సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బిసి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణలను అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతుంది.