ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్ర పాలకులు వున్నట్టుండి తీసుకొన్న నిర్ణయం సంచలనం సృష్టించింది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12నే ముగిశాయి. మామూలుగా నవంబర్‌లో శీతాకాల సమావేశాలు జరగనుండగా ఇంతలోనే ఈ ప్రత్యేక భేటీ ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇదే సమయంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని కేంద్రం నియమించింది. ప్రత్యేక సమావేశాల నిర్ణయం, ఈ కమిటీ నియామకం ఇంచుమించు ఒకేసారి జరగడంతో ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యూహంపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపి ఈ ఏడాది డిసెంబర్‌లో జరగవలసి వున్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలతో పాటు వాటిని కూడా నిర్వహించాలన్నది కేంద్రం ఆలోచన అని అంతటా అనుకోడం మొదలుపెట్టారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయం ఇటీవలనే అంచనా వేశారు. ఇందుకు అనుగుణమైన కీలకమైన కొన్ని నిర్ణయాలకు ఆమోదం పొందడానికే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపిస్తున్నారనే అభిప్రాయం పుంజుకొన్నది. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజలెన్నుకొనే ప్రతినిధుల పాలనలోని దేశం. అలాంటి పాలకులు ఇటువంటి కీలక నిర్ణయాన్ని తీసుకోదలచినప్పుడు ప్రజలతో సంప్రదించడం మంచి పద్ధతి అవుతుంది. లోక్‌సభకు, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించడమనేది దేశగతిని మార్చివేసే అతిపెద్ద నిర్ణయం కాగలదు. దీనిపై కమిటీని నియమించేటప్పుడు ప్రజల అభిప్రాయం తెలుసుకోడం తెలివైన చర్య అవుతుంది. కాని కేంద్రాన్ని ఏలుతున్న బిజెపి పాలకులలో అటువంటి మంచి ఆలోచన కలుగుతుందనుకోడం అత్యాశే కాగలదు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశాలలో వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరగవలసి వుంది. వాటిని కూడా ముందుకు జరిపి డిసెంబర్‌లో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటి ఎన్నికల వల్ల తరచూ దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ,
నియమావళి అమల్లోకి వస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతాయనేది వాస్తవమే అయినప్పటికీ అలాగే ఎన్నికల వ్యయ భారం అపరిమితంగా వుంటుందనేది కూడా నిజమే అయినప్పటికీ ఈ రెండింటినీ తప్పించడానికి జమిలి ఎన్నికలు జరిపించడం కొండ నాలుకకు మందు వేస్తే వున్న నాలుక ఊడిన చందమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం కొరవడే పరిస్థితి తలెత్తకూడదు. జమిలి ఎన్నికల వల్ల, ఏ రాష్ట్రంలోనైనా అసమ్మతి, అవిశ్వాస తీర్మానం వంటివి సంభవించి ప్రభుత్వాలు పడిపోతే ఆ రాష్ట్రంలో అప్పటికప్పుడు ఎన్నికలు జరిపించడం కుదరదు. అక్కడ అసెంబ్లీ లేకుండా అధికారుల పాలన సంవత్సరాల తరబడి కొనసాగే దుస్థితి తలెత్తుతుంది. అందుచేత జమిలి ఎన్నికలు సప్రజాస్వామికం కావు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈసారి సహజంగా జరిగే ఎన్నికలంటే ఎందుకో భయపడుతున్నట్టు బోధపడుతున్నది. ముఖ్యంగా కర్నాటకలో చవిచూచిన ఓటమి వారికి చెప్పనలవికాని బాధను, భయాన్ని కలిగించి వుండాలి. అప్పటి నుంచి ప్రధాని మోడీ ప్రతిష్ఠను అనేక రెట్లు, అనేక విధాలుగా పెంచి చూపించే ప్రయత్నాలను చేస్తున్నారు.
ప్రతి పదిమందిలోనూ ఎనిమిది మంది భారతీయులు ప్రధాని మోడీని ఇష్టపడుతున్నారని ఒక సర్వే నివేదిక ఊడిపడడం వెనుక కూడా ఈ భయమే పని చేసినట్టు అర్థమవుతున్నది. ఇలా కృత్రిమ పద్ధతుల్లో ప్రతిష్ఠను పెంచుకొని ప్రజలను ఆకట్టుకోవాలని బిజెపి చూస్తున్నది. వంట గ్యాస్ ధరను రూ. 200 తగ్గించడం వెనుక కూడా ఓటమి భయమే చోటు చేసుకొన్నది. ఇంకొక వైపు ఊహించని విధంగా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నిర్విఘ్నంగా ముందడుగు వేస్తున్నది. మరోవైపు అదానీ కుంభకోణం ఇంకా పిల్లలు పెడుతూనే వున్నది. అది ప్రధాని మోడీ ప్రతిష్ఠను దిగజార్చే పరిణామం. అందుచేత జమిలి ఎన్నికలను జరిపించడం ద్వారా ఓటర్లను గందరగోళంలోకి దింపి మళ్ళీ గెలవొచ్చునని బిజెపి ఆశిస్తూ వుండవచ్చు. కాని జమిలి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగానికి ఐదు సవరణలు చేయాలని అది ఇప్పట్లో జరిగే పని కాదని నిపుణులు సలహా ఇచ్చారని అందుచేత దానిని పక్కన పెట్టారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయినా రామ్‌నాథ్ కోవింద్ కమిటీని నియమించారంటే ఎలాగైనా వాటిని జరిపించాలనే పట్టుదలకు ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చిందని అనుకోవలసి వుంది. ప్రపంచంలో జమిలి ఎన్నికల సంప్రదాయం బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రియాల్లోనే వున్నది. ఇంత సువిశాల దేశంలో అటువంటి పద్ధతిని అమలు చేయడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.