Wednesday, January 22, 2025

అలనాటి భగీరథుడు నవాజ్ జంగ్

- Advertisement -
- Advertisement -

Special Story on Nizam Engineer Nawaz Jung

శాతవాహనుల నుండి నిజాం ప్రభువుల వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో మంది పాలించారు. వీరి హయాంలో అనేక మంది ఇంజనీర్లు హైదరాబాద్ సంస్థానానికి సేవలు అందించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడాలలో ఇంజినీర్ల కళ, నైపుణ్యం మనం చూడవచ్చు. నేటికీ అవి ఎలా చెక్కుచెదరకుండా ఉన్నాయంటే నాటి ఇంజినీరింగ్ నైపుణ్యం ఎంతటి గొప్పదో మనకు అర్ధమవుతుంది. ఈ ఇంజినీర్లలో అగ్రగణ్యుడు, అపర మేధావి, ఆర్ధిక వేత్త, దార్శనికుడు, అత్యంత ప్రతిభాశాలి, తెలంగాణని సస్యశ్యామలం చేయడంలో ఎనలేని కృషి చేసిన అలనాటి భగీరథుడు, నీటి పారుదల పితామహుడుగా, తెలంగాణ సర్ ఆర్థర్ కాటన్‌గా పిలవబడే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించిన జలాశయాలే నేడు తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలిచాయి. ఆయన దార్శనికత తో నిర్మించిన ఎన్నో జలాశయాలను నేను నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ 1877 జులై 11న హైదరాబాద్‌లో జన్మించాడు. ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ పాఠశాలలో హైస్కూల్ విద్యను అభ్యసించి, తర్వాత నిజాం కాలేజ్ నుంచి పటభద్రుడు అయ్యాడు. 1896లో ప్రభుత్వం ఇచ్చిన ఉపకార వేతనంతో ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాతి ఇంజినీరింగ్ కళాశాలైన రాయల్ ఇండియన్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరి సివిల్ ఇంజినీరింగ్ అభ్యసించాడు. 1899లో హైదరాబాద్ తిరిగి వచ్చి పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్ సంస్థానానికి చీఫ్ ఇంజినీర్‌గా నియమించబడ్డాడు. నిజామాబాద్‌లోని అలీ సాగర్ రిజర్వాయర్ ఈయన పేరు మీదుగానే నామకరణం చేశారు. ఈయన నేషనల్ ప్లానింగ్ కమిటీ అండ్ రివర్ ట్రైనింగ్ అండ్ ఇరిగేషన్ కి చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.
హైదరాబాద్ నిజాం సంస్థానంలో అత్యంత ప్రతిభావంతుడైన సివిల్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ సేవలు వెలకట్టలేనివి. హైదరాబాద్ పట్టణ ప్రాశస్తిని పెంచే ఆనాటి కట్టడాలైన ఉస్మానియా ఆర్ట్ కళాశాల, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్‌గంజ్ లైబ్రరీ, యునాని హాస్పిటల్, జూబ్లీహాల్, నగరంలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఫతే మైదాన్‌లోని మహబూబియ గ్రాండ్ స్టాండ్, మక్కా మసీదు దగ్గర సదర్ నిజామియా షఫాఖానా, మహబూబియా బాలికల పాఠశాల, నాందేడ్‌లోని సివిల్ హాస్పిటల్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈయన నిర్మించినవే. ఈ కట్టడాలన్నీ నవాబ్ జంగ్ కళా నైపుణ్యానికి అద్దం పడతాయి.

ఈయన నీటిపారుదల రంగంలో ఎనలేని సేవలు అందించాడు. నిజామాబాద్‌లోని నిజాంసాగర్ జలాశయం, అలీ సాగర్ జలాశయం, ఖమ్మంలోని పాలేరు జలాశయం, 2.52 టిఎంసిల సామర్ధ్యం గల వైరా జలాశయం ఈయన నిర్మించినవే. 1908 సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో మూసీ నది వరదలు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. నష్ట నివారణలో భాగంగా వరదలు సంభవించకుండా ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా అప్పటి నిజాం ప్రభువు మీరు ఉస్మాన్ అలీ ఖాన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆహ్వానించారు. విశ్వేశ్వరయ్య, నవాజ్ జంగ్ ఇద్దరి మేధో మథనం నుంచి పుట్టినవే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు. అవి మూసీ నది వరదలను నివారించడమే కాకుండా హైదరాబాద్ నగర ప్రజలకు శాశ్వత తాగునీటి వనరులుగా నేటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు వరద నీటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో జంగ్ కృషి మరవలేనిది. గోదావరి, మంజీరా నదులపై బ్రిడ్జిలను నిర్మించి తెలంగాణలో నీటిపారుదల రంగానికి ఎంతో కృషి చేశాడు. డిండి ప్రాజెక్టు, రాయనిపల్లి, సింగరూపాలెం, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, మహబూబ్ నగర్‌లోని కోయిల్ సాగర్, తుంగభద్ర ప్రాజెక్టులు జంగ్ అపార ప్రతిభకు నిదర్శనాలు. అదిలాబాద్ జిల్లా సోన్ గ్రామం వద్ద గోదావరి నదిపై రాతి వంతెన, గుల్బర్గా జిల్లా యాద్గిర్ వద్ద భీమా నదిపై రాతి వంతెన నిజామాబాద్ జిల్లా బండపల్లి వద్ద మంజీరా నదిపై రాతి వంతెన, ఖమ్మం జిల్లా మున్నేరు నదిపై రాతి వంతెన, ఔరంగాబాద్ లోని శాఘడ్ వద్ద ఆర్‌సిసి వంతెన, మహబూబ్ నగర్ లోని అనగండ దగ్గర కృష్ణానదిపై రాతి వంతెన, రాయ్‌చూరులోని తుంగభద్ర నదిపై రాతి వంతెన, ఇలా ఎన్నో పటిష్టమైన నిర్మాణాలు జంగ్ నైపుణ్యానికి మచ్చుతునకలు.

ఈయన జల వివాదాలు పరిష్కరించడంలో నేర్పరి. 1928లో మద్రాసు, మైసూరు, బాంబే, హైదరాబాద్ సంస్థానాల మధ్య గల కృష్ణ, తుంగభద్ర జలాల కేటాయింపును చాలా సమర్ధవంతంగా పరిష్కరించాడు. ఆయా సంస్థానాధిపతులతో చర్చలు జరిపి హైదరాబాద్ సంస్థానానికి రావలసిన వాటాను తీసుకు రావడానికి కృషి చేశాడు. తద్వారా 1930లో మద్రాస్ ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రానికి 50 శాతం నీటిని ఇవ్వడానికి ఒప్పుకున్నది. పాకిస్తాన్‌లోని సుక్కుర్ బ్యారేజ్ నిర్మాణానికి సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలలో సేవలు అందించాలని, అందుకు గాను మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి పని చేయవలసిందిగా ఆనాటి బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి ఆహ్వానం అందుకున్న గొప్ప ఇంజినీర్ ఆయన. నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎంతటి ప్రతిభావంతుడో అంతటి దార్శనికుడు కూడా. ఈయన తర్వాతి కాలంలో నిర్మించబడ్డ ఎన్నో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేసింది ఈయనే. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్, చంద్ర సాగర్, నందికొండ, మండ్లిపాకల ప్రాజెక్ట్, మహబూబ్ నగర్‌లోని రాజోలి బండ ప్రాజెక్ట్, సరళ సాగర్, భీమా, కరీంనగర్‌లోని అప్పర్ మానేరు ప్రాజెక్టు, మహారాష్ట్రలోని పూర్ణ ప్రాజెక్ట్, పెనుగంగా ప్రాజెక్టు, మెదక్ జిల్లాలోని దేవనూరు, ఘన్ పూర్ ఆనకట్ట, నిజామాబాద్‌లోని పోచంపాడు ప్రాజెక్టులు నవాజ్ జంగ్ చేసిన ప్రతిపాదనల వలనే నిర్మించబడ్డాయి. భారత దేశంలోనే అతి భారీ ప్రాజెక్టులైన భాక్రానంగల్, హిరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ప్లాన్లలోనూ నవాజ్ జంగ్ కీలక పాత్ర వహించారు.

జంగ్ ముందు చూపు కలిగిన ఆర్ధికవేత్త, పరిపాలనాదక్షుడు కూడా. నిజామాబాద్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చేసిన రెండు ప్రధాన నిర్మాణాలకు నవాజ్ అలీ జంగ్ దార్శనికతే కారణం. అవి మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు, బోధనలో నిర్మించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ. రెండు లక్షల డ్బ్భై ఐదు వేయిల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు 1933లోనే పూర్తయి, ఆసియాలోనే తలుపులతో నిర్మించబడ్డ అతి పెద్ద ప్రాజెక్టుగా పేరొందింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నాటికే ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. 1938లో జవహర్ లాల్ నెహ్రూ చైర్మన్ గా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు అయింది. ఈ ప్లానింగ్ కమిటీ సాగునీరు, నదుల మళ్లింపు తదితర అంశాలను అధ్యయనం చేయడం కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీకి చైర్మన్‌గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నియమితులయ్యారు. నవాజ్ జంగ్ ఇచ్చిన కీలక నివేదికలను తర్వాతి కాలంలో నెహ్రూ ప్రభుత్వం అమలు పరిచింది.

ఢిల్లీ లోని సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్, ఎలక్ట్రిసిటీ అథారిటీ, పుణెలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ జంగ్ నివేదికల ప్రకారమే ఏర్పాటు చేయబడ్డాయి. దేశంలో అన్ని నదులపై గేజింగ్ స్టేషన్లు, దేశ వ్యాప్తంగా వర్షపాతాన్ని నమోదు చేయడానికి రెయిన్ గేజ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అవసరాన్ని గుర్తించిన దార్శనికుడు జంగ్. భారత దేశంలోని నదులపై గరిష్ఠ వరద ప్రభావం అంచనాకి సాధారణంగా డికెన్స్ ఫార్ములాను, రైన్స్ ఫార్ములాను ఉపయోగిస్తారు. ఈ పార్ములాలను ఉపయోగించి లెక్కించిన గరిష్ఠ వరద ప్రవాహం అంచనా, వాస్తవ వరద ప్రవాహం మధ్య వ్యత్యాసం చాలా ఉండడం నవాజ్ అలీ జంగ్‌ని ఆలోచింప చేసింది. దీంతో వాస్తవ పరిస్థితులకు సరిపోయే విధంగా ఒక పార్ములాని రూపొందించాడు. ఇదే అలీ నవాజ్ జంగ్ ఫార్ములాగా ప్రసిద్ధి చెందింది. హైడ్రాలజీ విద్యార్థులకు రైన్స్, డికెన్స్ ఫార్ములాలతో పాటు అలీ నవాజ్ జంగ్ ఫార్ములాని కూడా బోధిస్తారు. జంగ్ చేపట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, టెలిఫోన్ వ్యవస్థ విస్తరణలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలకారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇన్ని ఘనతలు సాధించిన అలీ నవాజ్ జంగ్‌కి సరైన గుర్తింపు లభించలేదన్నది చరిత్ర చెబుతున్న నిజం. ఆయన కలలుగన్న 28 లక్షల ఎకరాలకు సాగు నీరందించే గోదావరి లోయ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మించకుండానే 1949 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచాడు. తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనంలో దొరికిన గొప్ప ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్. ఆయన నిర్మించిన కట్టడాలన్నీ తెలంగాణకి ఆయన ఇచ్చిన సంపద. మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహాద్భుతాలు సృష్టించ వచ్చని నిరూపించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జీవితం, సాధించిన విజయాలు, దార్శనికత నేటి తరం ఇంజినీర్లకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎందరో ఇంజినీర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం హర్షించదగ్గ విషయం.

* జక్కుల శ్రీనివాస్

(srinivasjakkula1998@gmail.com)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News