గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠ మాల, నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటిగా ప్రకటించుకున్న ప్రజా కవి దాశరధి కృష్ణమాచార్య. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణా’ అని ఎలుగెత్తి చాటి ఎంతోమంది ఉద్యమకారులకు ప్రేరణగా నిలిచిన అభ్యుదయ కవి దాశరథి. తెలంగాణ సాయుధ పోరాటంలో పద్యాలను పదునైన ఆయుధాలుగా మలుచుకొని కవిత్వాన్ని ఉద్యమానికి ఊపిరిగా చేసుకొని కమ్యూనిస్టు భావాలను నరనరాల్లో జీర్ణించుకొని తను రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి జైలు గోడలను సైతం పుస్తకాలుగా మలుచుకొని విప్లవ గీతాలను రచించారు.
సాంస్కృతిక చైతన్యం కలిగించిన మహాకవి..
తెలుగు సాహితీవనంలో విరబూసిన మహోన్నత పుష్పం అయిన దాశరథి 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లాలోని చిన్నకోడూరులో జన్మించారు. ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ సాహిత్యంలో బీఏ చదివిన దాశరథి నాటి నిజాం పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినారు. ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. మంచి ఉపన్యాసకుడైన దాశరథి భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్మాతల్లో ముఖ్యుడు.తల్లి మీద తల్లి తెలంగాణ మీద రాసిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
నిజాం వ్యతిరేక పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా కవితలు రాసినందుకు ఆయనను అరెస్టు చేసి వరంగల్ జైల్లో ఉంచారు. ఆ తర్వాత కొద్ది రోజులకు దాశరథిని నిజామాబాద్ జైలుకు తరలించారు.ఇందూర్ జిల్లా జైలులో ఉన్నప్పుడు పళ్ళు తోముకునే బొగ్గుతో జైలు గోడలపై ఎన్నో కవితలు రాశాడు. ఆ కవితలు రహస్యంగా బయటకు వచ్చి ప్రజలను చైతన్యవంతులు చేసేవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంలో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైన కవితా సంపుటాలను నవమి, యాత్రస్మృతి వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చినారు.
దాశరథి కవిత విభిన్న అంశాల సమాహారం..
నిరంకుశ నిజాం ప్రభుత్వం పై నిప్పులు కురిపించిన భాస్వరం దాశరథి కవిత్వం. జైలు గీతాలు స్మృతి కవితలతో పాటు శ్రామిక జన చైతన్యం సమసమాజ నిర్మాణ ఆకాంక్ష మొదలైన అంశాలపై కవిత్వం రాశారు./ ‘దీన పరాధీన జాతి/శ్రామిక జాతి/దెబ్బతిన్న బెబ్బిలి వలె /మేల్కొన్నది మేల్కొన్నది‘/అంటూ మేల్కొంటున్న శ్రామిక జల చైతన్యానికి స్వాగతం పలికాడు./ జనం మనం -మనం జనం/జనం లేక మనం లేము./కలపండి భుజం భుజం/ కదలండోయ్ గజం గజం. అంటూ ఉద్యమ ఆహ్వానం పలికాడు, ప్రజాస్వామ్యవాదం వైపు ప్రయాణించాడు.
పర్యాటక ప్రాంతంగా దాశరథి జైలు..
‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు‘ అంటూ నినాదించిన దాశరథి శ్రీకృష్ణమాచార్యుల అక్షర ఆగ్రహానికి వేదికైనా నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు జిల్లా జైలు పర్యాటక ప్రాంతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం రు 40 లక్షల నిధులు కేటాయించి పాడుబడిన జైలును ఆధునికరిస్తున్నారు. దాశరథి విగ్రహాన్ని జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.దాశరథి జీవిత విషయాలను తెలిపేందుకు అతని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు కృషి చేస్తున్నారు.‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ‘ అని బొగ్గుతో రాసిన జైలు గదితో పాటు మిగిలిన వాటిని సుందరీకరిస్తున్నారు.
అంకం నరేష్- 6301650324