Wednesday, November 20, 2024

తిరుమలలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టిటిడి అడిషనల్ ఇఒ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో గురువారం సాయంత్రం టిటిడి సివిఎస్వో  శ్రీధర్, తిరుపతి ఎస్పి సుబ్బరాయుడలతో కలిసి టిటిడి, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మాట్లాడుతూ తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టిటిడి, విజిలెన్స్, పోలీసులు, ఆర్ టిఎ, టౌన్ ప్లానింగ్, ఎపిఎస్ ఆర్టీసీ, టిటిడి ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జిఎంలు కమిటీ గా ఏర్పడి వారం రోజుల లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.

సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు

•⁠ ⁠తిరుమలలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గోకులం, ఎటిసి, రామ్ భగీచా వంటి ప్రాంతాలను గుర్తించాలి.

•⁠ ⁠వివిధ వర్గాల భక్తులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలకు సూచిక బోర్డులను, నిర్ధిష్టమైన పార్కింగ్ ను ఏర్పాటు చేయాలి.

•⁠ ⁠తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు టిటిడి నుండి అదనపు సిబ్బందిని కేటాయించాలి.

•⁠ ⁠తిరుమలలో భవిష్యత్తులో చేపట్టే నిర్మాణాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి చేయడం, మల్టీ లెవెల్ పార్కింగ్ లను నిర్మించాలి.

•⁠ ⁠నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని, అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి.

•⁠ ⁠ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలి.

ఈ కార్యక్రమంలో టిటిడి రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, అడిషనల్ ఎస్పి ఐ.రామకృష్ణ, విజిఒలు రామ్ కుమార్, సురేంద్ర, టిటిడి, విజిలెన్స్, పోలీస్, ఆర్టిఎ, ఎపిఎస్ ఆర్టిసి, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News