Monday, December 23, 2024

వికలాంగుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

ఎన్‌పిఆర్‌డి డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల అధినేత పఠాన్ ఉమర్ ఖాన్ అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2024 క్యాలెండర్ ను హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమర్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం చట్టాలను అమలు చేయాలని కోరారు. వికలాంగులు సమాజంలో వివక్షతకు, చిన్న చూపుకు గురవుతున్నారని వారిలో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. వికలాంగుల్లో అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.

2024 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఎన్‌పిఆర్‌డి ముద్రించడం అభినందననీయమని అన్నారు. సమస్యలపై పోరాడుతూనే వికలాంగులను చైతన్యవంతం చేసేందుకుఎన్‌పిఆర్‌డి కృషి చేస్తోందని ప్రశంసించారు. 21 రకాల వైకల్యాల ప్రత్యేక రోజులు క్యాలెండర్ లో ముద్రించడం ద్వారా వికలాంగుల పట్ల సమాజంలో మరింత అవగాహన కలుగుతుందని అన్నారు. మూగ, చెవిటి, మానసిక వికలాంగ పిల్లలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేయాలని కోరారు. ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ వికలాంగులను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు. వికలాంగుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కేంద్రలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులలో దాగి ఉన్న శక్తి సామర్థ్యలు బయటకు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు, ప్రభుత్వ అధికారులకు 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంపై అవగాహనా కల్పించాలని డిమాండ్ చేశారు. క్యాలెండర్ ముద్రణ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెలెన్ కెల్లార్ పిజి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ముఘం, హెలెన్ కెల్లార్ రిహబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ ఎం. శశిధర్ రెడ్డి, సిబ్బంది గౌస్, ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్ , రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. నాగలక్ష్మి, నాయకులు అమరావతి, చంద్రశేఖర్, అనిల్ లతో పాటు విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News