హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ- టు కొల్లం, కొల్లం- టు కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. కాచిగూడ టు కొల్లం (07109) రైలు డిసెంబర్ 18, 25వ తేదీల్లో, జనవరి 1, 8, 15వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కొల్లం నుంచి కాచిగూడకు డిసెంబర్ 20, 27వ తేదీల్లో, జనవరి 3, 11, 17వ తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ -టు కొల్లం రైలు ప్రతి సోమవారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30 గంటలకు కొల్లం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
తిరుగు ప్రయాణంలో అదే రోజున ఉదయం 10.45 గంటలకు బయలుదేరి గురువారం కాచిగూడకు చేరుతుంది. రైలు రెండుమార్గాల్లో ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుర్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్‌పాడి, ఈరోడ్, పాల్‌ఘాట్, ఎర్నాకులం టౌన్, కాయంకులం, తదితర రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకల సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి ఆలయం గత నెల 17వ తేదీన తెరుచుకుంది.