కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో వాణిజ్య ట్రక్కు డ్రైవర్లకు విమాన పైలట్ల తరహాలో నిర్దిష్టమైన డ్రైవింగ్ పనిగంటలను నిర్ణయించాలని కేంద్ర రవాణా శాఖ మత్రి నితిన్ గడ్కరీ సూచించారు. అంతేగాక వాణిజ్య వాహనాలను నడుపుతున్న సమయంలో డ్రైవర్లు నిద్రపోకుండా ఉండేందుకు స్లీప్ డిటెక్షన్ సెన్సార్లను అమర్చాలని కూడా ఆయన ప్రతిపాదించారు. తగిన విశ్రాంతి లేకుండా వాహనం డ్రైవర్లు ట్రక్కులను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని తగ్గించడానికి విమాన పైలట్ల తరహాలో ట్రక్కు డ్రైవర్లకు కూడా నిర్దిష్ట పని గంటలు ఖరారు చేయాలని గడ్కరీ మంగళవారం ట్వీట్ల ద్వారా ప్రతిపాదించారు. వాణిజ్య వాహనాల డ్రైవర్ క్యాబిన్లలో యూరోపియన్ ప్రమాణాలకు దీటుగా స్లీప్ డిటెక్షన్ సెన్సార్లను అమర్చడంపై కూడా ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జిల్లా రోడ్డు కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరిగే చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రులకు, జిల్లా కలెక్టర్లకు లేఖలు రాస్తానని ఆయన చెప్పారు.