హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పించారని భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్‌లా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగంతో గవర్నర్ స్థాయిని తగ్గించారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలల పాలనలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 400 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోయి.. రైతులు ఇబ్బంది పడుతున్నరని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదని అన్నారు.కెసిఆర్‌పై కోపంతోనే మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదన ఆయన ధ్వజమెత్తారు. 20 శాతం కమీషన్ తప్ప ఏ మాత్రం విజన్ లేని ప్రభుత్వం ఇది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేదని.. ఢిల్లీకి మూటలు పంపించేందుకే ఈ ప్రభుత్వం ఉందని ఆయన దుయ్యబట్టారు.