Sunday, December 22, 2024

ఐదు గ్యారెంటీలకు లబ్ధిదారుల ఎంపిక వేగం

- Advertisement -
- Advertisement -

అర్హుల గుర్తింపు ఐటి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ కు అప్పగింత
ఎంపికైన జాబితా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శన
గ్రామ కార్యదర్శులు వడపోతలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
అర్హత కలిగిన ప్రతి పేదవాడినికి పథకాలు సకాలంలో చేరాలి
వందరోజుల్లో ఖచ్చితంగా గ్యారెంటీలు అమలు చేయాలి
మండల, జిల్లాల అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ వేగవంతంగా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అత్యధిక పార్లమెంటు సీట్లు గెలించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి ఆరు గ్యారెంటీలను దశల వారీగా 100 రోజుల్లో అమలు చేసేందుకు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సంబంధిత శాఖ మంత్రులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ బీమా కింద వైద్య పరిమితి రూ.10 లక్షలకు పెంచడంతో రాష్ట్ర ప్రజల నుంచి రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రశంసలు అందుకుంటుంది. మిగతా వాటిని అమలు చేస్తే లోక్‌సభ ఎన్నికలతో పాటు, స్థానిక సంస్ధలో కూడా హస్తం హవా కొనసాగించవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు వ్యుహారచన చేస్తున్నారు. అందుకోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తేదీ వరకు ప్రజాపాలన పేరుతో అర్హులైన వారి నుంచి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు.

వీటిలో ఐదు గ్యారంటీల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా భూసమస్యలు, రేషన్‌కార్డులకు సంబంధించినవి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులకు సంబంధించిన వివరాలను 30వేల మంది సిబ్బంది డేటా ఎంట్రీ వేగం నిర్వహిస్తోంది. డేటా పూర్తి కాగానే పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికకు లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఉపయోగించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ శనివారం అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. వచ్చిన అప్లికేషన్లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిశీలిస్తాయని పార్టీ పేర్కొంది. రెండు రోజుల క్రితం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు అధికారులను అభయహస్తం దరఖాస్తుల్లో ఎలాంటి పొరపాట్లు జరగవద్దని, క్షుణంగా దరఖాస్తులు పరిశీలించి అర్హులను గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వం సూచించిన సమయానికి చేరవేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. అదే విధంగా అక్రమంగా ప్రభుత్వం పథకాలు లబ్దిపొందుతున్నవారి పట్ల కూడా కన్నేసి, తాము సూచించినప్పుడు వాటిని తొలిగించేందుకు తగిన వివరాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించబోతున్నట్లు ఉద్యోగులు విధుల నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల విషయంలో పక్షపాత ధోరణి కనిపించిందనే విమర్శలున్నాయని అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తియిన తరువాత లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ సెక్రటర్లు జాబితా ఎంపికల్లో పారదర్శకత పాటించేలా మండల, జిల్లా స్ధాయి అధికారులంతా చూడాలని రాష్ట్ర స్దాయి ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం . ఇప్పటికే కొంతమంది దళారులు అభయహస్తంలో దరఖాస్తు చేసినవి… వచ్చే విధంగా చేస్తామని మాయమాటలు చెబుతూ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని వారిపట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించినట్లు కిందిస్థాయి సిబ్బంది వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News