హైదరాబాద్: జలమండలి నూతనంగా నిర్మిస్తున్న ఎస్టీపీల పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్2,3లో భాగంగా ఫతేనగర్, మియాపూర్ పటేల్ చెరువు, కోకాపేటల్ నిర్మిస్తున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన అధికారులు,నిర్మాణ సంస్ద ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీపీల నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు 24గంటల పాటు పనులు జరపాలని, ఇందుకోసం మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.
అన్ని ఎస్టీపీల నిర్మాణ పనులు దశలవారీగా కాకుండా ఏకకాలంలో జరగాలని, ఇందుకు తగ్గట్లుగా కార్మికులు, యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని స్పష్టం చేశారు. కార్మికులు ఖచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలన్నారు. నిర్మాణ పనులతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూషీట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎస్టీపీ విభాగం ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్ద ప్రతినిధులు పాల్గొన్నారు.