బాలాపూర్: మీర్‌పేట్ కార్పొరేషన్‌లో రూ.25 కోట్లతో ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల అదనంగా మంజూరు చేసిన రూ.50కోట్ల ప్రత్యేక నిధులతో కలిపి మొత్తంగా కార్పొరేషన్ పరిధిలో ప్రస్ధుతం రూ.75 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి పేర్కొన్నారు.కార్పొరేషన్‌లోని 15,45వ డివిజన్లలో రూ.2.09 కోట్లతో నూతనంగా చేపట్టనున్న సిసిరోడ్లు,భూగర్భ డ్రైనేజి పనలుకు మేయర్,ఆయా డివిజన్ల స్ధానిక కార్పొరేటర్లు ముడావత్ దుర్గ,అక్కి మాధవిఈశ్వర్‌గౌడ్‌లతో కలిసి సోమవారం శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ మిధిలానగర్,లక్ష్మీనర్సింహ్మాకాలనీ,ఎంఎల్‌ఆర్‌కాలనీల మీదుగా జరిగిన ట్రంక్‌లైన్ నిర్మాణంతో ఇక్కడి ప్రజల వరదనీటి కష్టాలను శాశ్వతంగా తొలగించడం జరిగిందని అన్నారు.గొలుసుకట్టు చెరువుల మధ్యలో నీటిప్రవాహం సాఫీగా కొనసాగే విధంగా పెద్ద,మంత్రాల,సంద చెరువులను అనుసంధానిస్తూ ట్రంక్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మిధిలానగర్ ముంపు సమస్య పరిష్కారం గ్రేటర్‌లో సైతం నాళాల అభివృద్ధికి ఒక మార్గాన్ని చూపించిందని అన్నారు.కార్పొరేషన్‌కు పెద్దఎత్తున నిధుల ప్రవాహం కొనసాగుతుందని,ఒక ప్రత్యేక దార్శనీకతతో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతూ ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృత మార్కెట్,వైఖుంఠధామాల నిర్మాణంతో స్వచ్ఛతకు మారుపేరుగా మున్సిపాలిటిలు,కార్పొరేషన్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.రూ.1200 కోట్లతో కొనసాగుతున్న నాళాల అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.110 కోట్లతో నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు.త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రూ.210 కోట్లతో మిషన్ భగీరధ ద్వారా నూతన పైప్‌లైన్లు,ట్యాంకులు,రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టామని గుర్రంగూడ,కుర్మల్‌గూడ,జిల్లెలగూడ,బడంగ్‌పేట్‌ల్లో రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని అన్నారు.నియోజకవర్గంలోని బడంగ్‌పేట్,మీర్‌పేట్ కార్పొరేషన్లు,జల్‌పల్లి మున్సిపాలిటిల పరిధిల్లోని 10 చెరువుల్లో రూ.40 కోట్లతో అభివృద్ధి,సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు.రూ.250 కోట్లతో నియోజకవర్గంలోని పట్ణణ ప్రాంతాల్లో సిసిరోడ్లు,ఇతర అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు.
రూ.4,800 కోట్లతో నగరం నలువైపులా నిర్మిస్తున్న 4 సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్‌తో గాంధీ,ఉస్మానియా,నిమ్స్ ఆసుపత్రులపై బారం తగ్గనుందని అన్నారు.గతంలో ఒక్క యూపిహెచ్‌సి లేని ఈ ప్రాంతంలో అర్బన్ పిహెచ్‌సిలతో పాటు 10 బస్తీదావాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు.కుల,చేతివృత్తుల వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్ధికసహాయాన్ని అందిస్తుందని,గృహలక్ష్మీ పధకం ద్వారా ఖాళీస్ధలం ఉన్నవారు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు అందిస్తున్నామని,అర్హులైన ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రజకులు,నాయిబ్రాహ్మణులకు పూర్తి ఉచితంగా,ఎస్‌సి,ఎస్‌టిలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.
గత తొమ్మదిన్నర ఏండ్ల క్రితం,ప్రస్ధుతం మీర్‌పేట్ ఉన్న పరిస్ధితులను ఒకసారి పోల్చిచూసుకోవాలని అన్నారు.అదేవిధంగా మీర్‌పేట్,బడంగ్‌పేట్ కార్పొరేషన్లు,తుక్కుగూడ,జల్‌పల్లి మున్సిపాలిటిలకు రూ.150 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి,కమీషనర్ చిట్టి నాగేశ్వర్,పలువురు కార్పొరేటర్లు,కోఆప్షన్‌సభ్యులు,బిఆర్‌ఎస్‌పార్టీ నాయకులు,కార్యకర్తలు,పలు కాలనీల వాసులు పాల్గొన్నారు.