న్యూఢిల్లీ : సంక్షోభంలో ఉన్న బడ్జెట్ విమాన సంస్థ స్పైస్‌జెట్ తన ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగించేందుకు సిద్ధ మవుతోంది. వచ్చే రోజుల్లో దాదాపు 1000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని కంపెనీ యోచిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక పరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇతర ప్రతికూల పరిస్థితుల వల్ల కంపెనీ అధికంగా ఉన్న సిబ్బందిలో కోత పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. లేఆఫ్‌ల పరిమాణం ఎంత అనేది ఈ వారంలో తెలిసే అవకాశముందని అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌లైన్‌లో దాదాపు 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఖర్చు తగ్గింపు ప్రక్రియలో భాగంగా తన మొత్తం సిబ్బందిలో 10-15 శాతం మందిని ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.
కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, సంస్థ టర్న్‌అరౌండ్, వ్యయ తగ్గింపు వ్యూహంలో భాగంగా ఇటీవల కంపెనీ ఫండ్ ఇన్ఫ్యూషన్ తర్వాత అనేక చర్యలను ప్రారంభించిందన్నారు. దీని లక్ష్యం లాభదాయకమైన వృద్ధిని సాధించడం, భారతీయ విమానయాన పరిశ్రమలో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నమని అన్నారు. దీని ద్వారా కంపెనీ రూ. 100 కోట్ల వరకు వార్షిక పొదుపును ఆశిస్తోందని ఆయన తెలిపారు. ఉద్యోగుల తొలగింపు వార్తల తర్వాత స్పైస్‌జెట్ షేర్లు 4.18 శాతం పతనంతో రూ.65.33 వద్ద ముగిశాయి.