Monday, December 23, 2024

సమయపాలన లేని సంస్థగా స్పైస్‌జెట్ ఫస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్ భారతదేశంలో స్పైస్‌జెట్ లిమిటెడ్ అత్యంత ఆలస్యం చేసే సంస్థగా మొదటి స్థానంలో ఉంది. సమ్మర్ ట్రావెల్ సీజన్ మే నెలలో దేశంలోని 4 అతిపెద్ద విమానాశ్రయాల (ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్) నుండి స్పైస్‌జెట్ విమానాలలో 61 శాతమే సమయానికి బయలుదేరాయి. అంటే ఈ కాలంలో స్పైస్‌జెట్ ప్రయాణికులు 39 శాతం తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేదు. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలో స్పైస్‌జెట్ విమానాలలో 70 శాతం సమయానికి బయలుదేరగా, 30 శాతం ఆలస్యం అయ్యాయి. స్పైస్‌జెట్ ప్రతిరోజూ 250కి పైగా విమానాలను నడుపుతోంది. దేశీయ ప్రయాణీకుల రద్దీ మే నెలలో 15 శాతం పెరిగి 1.32 కోట్లకు చేరుకుంది.

ఐదో స్థానంలో ఎయిర్ ఇండియా
దేశంలోని రెండో అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సమయపాలనలో రెండో స్థానం నుండి ఐదో స్థానానికి పడిపోయింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఎయిర్ ఇండియా విమానాలు దాదాపు రెట్టింపు ఆలస్యం అయ్యాయి. ఎయిర్ ఇండియా 82.5 శాతం విమానాలు సమయానికి చేరుకున్నాయి. అంటే 17.5 శాతం ఆలస్యం అయ్యాయి. మే నెలలో అత్యంత సమయపాలన కల్గిన విమానయాన సంస్థగా అకాశ ఎయిర్ మొదటి స్థానంలో(92.6 శాతం) నిలిచింది. కానీ అంతకుముందు నెల ఏప్రిల్‌తో పోలిస్తే ఈ సంస్థ పనితీరు తగ్గింది. ఆ తర్వాత సమయపాలనలో ఇండిగో రెండో స్థానంలో(90.3 శాతం) విస్తారా మూడో స్థానంలో(89.5 శాతం), ఎయిర్ ఏషియా నాలుగో స్థానం(84.8 శాతం)లో ఉన్నాయి.

ఈ కారణాల వల్ల విమాన ఆలస్యం
భారతదేశం విమానయాన మార్కెట్‌లో పోటీ నెలకొంది. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, ఈ సమస్యలు ఇప్పటికీ విమాన ఆలస్యానికి కారణమవుతున్నాయి. మే, జూన్‌లలో పాఠశాల సెలవుల సమయంలో ప్రయాణాలు పెరుగుతాయి. విమానయాన సంస్థలు వేగాన్ని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి. అదే సమయంలో గో ఎయిర్‌లైన్స్ దివాలా తీయడం వల్ల, ఇతర ఎయిర్‌లైన్ ఆపరేటర్లపై భారం పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News