Monday, December 23, 2024

విమానం టాయిలెట్‌లో ఇరుక్కున్న ప్రయాణికుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : స్పైస్‌జెట్ విమానంలో మంగళవారం ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎస్‌జి 268 విమానం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి 14 డీ సీటులో కూర్చున్న ప్రయాణికుడు టాయిలెట్ రూమ్‌కు వెళ్లాడు. డోర్ తెరుచుకోక పోవడంతో బయటకు రాలేక చిక్కుకు పోయాడు. అతడు లోపలి నుంచి గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది తలుపు తెరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. దాదాపు 100 నిమిషాల సేపు టాయిలెట్ లోనే ఉండవలసి వచ్చింది. విమాన సిబ్బంది ఒక పేపర్ నోట్ రాసి లోపలికి పంపారు. “ ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాలేదని, ఆందోళన చెందవద్దు. మరికొన్ని నిమిషాల్లో మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. ఆ లోపు మీరు కమోడ్‌లోనే కూర్చోండి. మెయిన్‌డోర్ ఓపెన్ అవ్వగానే ఇంజినీర్ వచ్చి బాత్రూం డోర్ తెరుస్తారు ” అని ఆ నోట్‌లో రాసినట్టు ఎయిర్ హోస్టెస్ తెలిపారు.

చివరికి కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకి విమానం చేరుకోగానే ఇంజినీరు వచ్చి డోర్ ఓపెన్ చేసి ప్రయాణికుడిని బయటకు తీసుకురాగలిగారు. ఆ తరువాత అతనికి వైద్య సహాయం అందించారు. ప్రయాణ సమయమంతా తమ సిబ్బంది ఆయనకు సహాయం అందించారని, మార్గదర్శకాలు అందజేశారని అధికార ప్రతినిధి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన కారణంగా ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని స్పైస్‌జెట్ విమాన సంస్థ పేర్కొంది. ఆ ప్రయాణికుడికి రీఫండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. ఈలోగా విమాన ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. డిసెంబర్‌లో రద్దయిన విమానసర్వీస్‌లకు సంబంధించి ఇంతవరకు రీఫండ్ చెల్లించలేదని ప్రయాణికులు తీవ్ర విమర్శలు చేశారు. దీనికి స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి స్పందించారు. డిసెంబర్, అంతకు ముందు రద్దయిన విమానసర్వీస్‌లకు రీఫండ్ చెల్లించే విషయమై ప్రాసెస్ జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News