న్యూఢిల్లీ : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ పైలట్లకు తీపి కబురు వినిపించింది. పైలట్ల వేతనాన్ని 20 శాతం వరకు పెంచబోతున్నట్లు విమాన సంస్థ ప్రకటించింది. ఫ్లైట్ ఆపరేషన్స్ చీఫ్ కెప్టెన్ గుర్చరణ్ అరోరా మాట్లాడుతూ, ప్రభుత్వ అత్యవసర క్రెడిట్ ఫెసిలిటీ గ్యారెంటీ పథకం కింద విమానయాన సంస్థ సుమారు రూ. 225 కోట్లు పొందబోతోందని, దాని మొదటి విడత విడుదల అయిందని అన్నారు. దీంతో పైలట్ల ప్రయోజనాల దృష్టా విమానయాన సంస్థ అక్టోబర్‌లో వారి వేతనాన్ని 20 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు కంపెనీ 2 నుండి 3 వారాల్లో ఉద్యోగులందరి టిడిఎస్‌ను కూడా జమ చేయనుంది. అయితే బుధవారం నాడు విమాన సంస్థ రెగ్యులేటర్ డిజిసిఎ స్పైస్‌జెట్‌పై నిషేధాన్ని అక్టోబర్ 29 వరకు పొడిగించింది. అంతకుముందు కంపెనీ 80 మంది పైలట్లను సెలవుపై పంపింది. ఈ సమయంలో వారికి జీతాలు చెల్లించరు. కొంత కాలంగా భారీ నష్టాలను చవిచూడడం వల్లే ఎయిర్‌లైన్స్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.