ఎటిఎఫ్ ధరల పెరుగదలే కారణం
న్యూఢిల్లీ : వచ్చే రోజుల్లో విమానయాన చార్జీలు మరింత పెరగనున్నాయి. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం విమాన ఇంధనం ఎటిఎఫ్(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) ధరలను పెంచాయి. దీంతో అన్ని విమానయాన సంస్థలు ఈ భారాన్ని కస్టమర్లపై మోపేందుకు సిద్ధమయ్యాయి. బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌స్‌జెట్ చార్జీలను 15 శాతం వరకు పెంచనుంది. స్పైస్‌జెట్ చైర్మన్, ఎండి అజయ్ సింగ్ మాట్లాడుతూ, ఎటిఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత కారణంగా విమాన చార్జీలను పెంచడం మినహా తమకు వేరే మార్గం లేదని అన్నారు. గత ఏడాది(2021) జూన్ నుంచి చూస్తే ఇప్పటి వరకు విమాన ఇంధనం ధరలు 120 శాతం వరకు పెరిగాయి. గత ఆరు నెలల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఇంధన ధరలను 12 సార్లు సమీక్షించగా, వాటిలో 11 సార్లు ఎటిఎఫ్ ధరలను పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఎటిఎఫ్ ధర విపరీతంగా పెరిగింది. దీని కారణంగా విమాన చార్జీలు కూడా పెంచక తప్పలేదు.