Thursday, November 14, 2024

తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ

- Advertisement -
- Advertisement -

వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతుందని సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ విశేష పూజలు, ప్రార్థనలు, నమాజులు చేశారు. కొడకండ్ల మండలంలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. తొర్రూరు మసీదులు, అన్నారం షరీఫ్‌లో నమాజులు చేశారు. తొర్రూరులో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

పర్వతగిరి మండలం కల్లెడ శ్రీబైరవ సహిత ఆంజనేయస్వామి దేవాలయ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కల్లెడ ఎర్రబెల్లి రాంమోహన్‌రావులతో కలిసి మంత్రి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో మంత్రి దయాకర్‌రావు వేర్వేరుగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ స్వరాష్ట్రాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, గతంలో అత్యంత నిర్లక్షానికి గురైన మన దేవాలయాలు, మన కవులు, కళాకారులకు తెలంగాణ వచ్చాకే తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో ఒక్క యాదాద్రి మాత్రమే కాదు వేములవాడ, పాలకుర్తి, భద్రకాళి, ఐలోని కొమురరెల్లి, సన్నూరు, నాంచారి మడూరు ఇలా అతి పురాతన, కాకతీయుల కాలం నాటి దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్దరణ జరుగుతుందని చెప్పారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, కారిడార్‌తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ మూడు దేవాలయాల పేరున రూ.62.50కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాలకుర్తి గొప్ప క్షేత్రమని ఇది చారిత్రాత్మకం, మహిమాన్వితం అని అన్నారు. ఇక్కడ ఆదికవి సోమనాథుడు పుట్టిన నేల అని, పక్కనే బమ్మెరలో పోతన పుట్టాడని, రామాయణం రాసిన వాల్మీకి, పక్కనే వల్మిడిలో కొంత కాలం ఉండి మునుల గుట్టల తపస్పు చేశాడటని, పాలకుర్తి కవులు, కళాకారులకు పుట్టినిల్లు, తొలి తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుడు మన వారు కావడం మన అదృష్టమన్నారు.

ఆయన నడిచిన ఈ నేలలో మనమంతా జన్మించడం మన పూర్వజన్మ సుకృతం అన్నారు. తెలుగు కవిత్వంలో ఇంత గొప్ప కువులు, పండితులు ఇక్కడి వారే కావడం ఈ నేల చేసుకున్న పుణ్యమని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన సమయంలో ఆ ప్రాంగణానికి పాల్కురికి సోమనాథుడు అని పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. పాలుర్తి, బమ్మెర, వల్మిడి కారిడార్‌గా సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పాలకుర్తి గుడికి రూ.16కోట్ల 50 లక్షలు నిధులు వచ్చాయని, మొదటగా రూ.పది కోట్లే పెట్టా, అదనంగా ఆరున్నర కోట్లు పెట్టామని చెప్పారు. మొదట గుడికి వసతి గృహం, కళ్యాణ మండపం, గోశాల, నాలుగు వైపులా ఆర్చి గేట్లు, సప్తద్వారా స్తంబాల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

రూ.25 కోట్లతో టూరిజం హరిత భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. సోమనాథుని స్మారక విగ్రహ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ.ఏడు కోట్లతో వల్మీడి, రూ.14కోట్లతో బమ్మెర పోతన మందిరం అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం పాలకుర్తి, బమ్మెర, వల్మీడి దేవాలయాలను కారిడార్‌గా 62 కోట్ల 50లక్షలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. రూ.150కోట్లతో పాలకుర్తి చుట్టు రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నాను. సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు వంటి వాటితో పాలకుర్తి అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పాలకుర్తితో పాటు పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోని దేవాలయాన్ని ఆధునీకరించే పనులు నడుస్తున్నాయి.

సిఎం కెసిఆర్ అడిగిన వెంటనే కాదనకుండా డబ్బులు ఇస్తున్నారని అన్నారు. ఆ నిధులతో దేవాలయాల అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని చెప్పారు. ఒక్క పాలకుర్తి మాత్రమే కాదు మొత్తం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామ దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఎకరం స్థలంలో రూ.మూడు కోట్లతో సేవాలాల్ గుడి, రూ.కోటితో చెన్నూరు త్రికూటాలయం, రూ.13 కోట్ల91 లక్షలతో సన్నూరు దేవాలయం, రూ.3 కోట్ల 55 లక్షలతో వాన కొండయ్య, శ్రీలక్ష్మి నర్సింహాస్వామి దేవాలయ అభివృద్ధి, పాలకుర్తిలో ప్రత్యేకంగా రూ.25 కోట్లతో పర్యాటక హోటల్ భవన నిర్మాణం వంటి పనులు వివరించారు.

అలాగే రాష్ట్రం, ఉమ్మడి వరంగల్, జనగామ జిల్లాలోని, పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మసీదులు, చర్చీలకు కూడా పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఆయా చర్చీలు, మసీదుల నిర్మాణం, పునరుద్దరణ, ప్రహారీగోడల నిర్మాణం వంటి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News