జాతీయ రైతు అవార్డు విజేత ప్రయోగం
మహాకుంభ్ నగర్ (యుపి) : ప్రస్తుతం సాగుతున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది మంది భక్తులు సమీకృతం కాగా, జాతీయ రైతు పురస్కారం అందుకున్న ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఈ సందర్భాన్ని రైతుల్లో గోవు ఆధారిత ప్రకృతి, ‘ఆధ్యాత్మిక సేద్యం’ను ప్రోత్సహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ హర్దోయి జిల్లాకు చెందిన 50 ఏళ్ల కామర్స్ పట్టభద్రుడు దీక్షిత్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం సాగిస్తున్నారు. మహాకుంభ్ నగర్‌లోని సెక్టార్ 8లో ఆయన ‘ప్రకృతిక్ కిసాన్ పరివార్’ (ప్రకృతి రైతుల కుటుంబం) బ్యానర్ కింద ఒక శిబిరం ఏర్పాటు చేశారు.
త్రివేణి మార్గ్ ఖాదీ ఎగ్జిబిషన్‌లో గోవు ఆధారిత సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న స్టాళ్లను కూడా ఆయన ఏర్పాటు చేశారు. దీక్షిత్ ‘పిటిఐ’తో మాట్లాడుతూ, ‘వందలాది మంది ప్రగతిశీలక రైతులు మా శిబిరాన్ని సందర్శించి, గోవు ఆధారిత సేద్య పద్ధతులు అనుసరిస్తామని ప్రతిన బూనారు’ అని తెలిపారు. అసలు గోండాకు చెందిన దీక్షిత్ పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పలేకర్, ఆచార్య దేవ్‌వ్రత్ నుంచి శిక్షణ పొందిన తరువాత 2009లో ప్రకృతి సేద్యం చేయనారంభించారు. ఆయన తన హర్దోయి ఫార్మ్‌లో 15 ఆవులతో ఒక గోశాల ఏర్పాటు చేశారు.
అది ఆతరువత కుటుంబ కార్యక్రమంగా మారింది. ఆయన 23 ఏళ్ల కుమారుడు, వ్యవసాయ పట్టభద్రుడు అనుపమ్, అతని భార్య సుష్మా చురుకుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉత్తర ప్రదేశ్ గో సేవ ఆయోగ్ చైర్మన్ శ్యామ్ బిహారి గుప్తా కుంభమేళాలో దీక్షిత్ కృషిని శ్లాఘించారు. ‘దీక్షిత్ రైతు కావడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ప్యాకేజింగ్ కూడా చేస్తున్నారు, తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు రైతులను ప్రోత్సహిస్తున్నారు’ అని గుప్తా తెలిపారు. దీక్షిత్ ప్రభుత్వం మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.