Monday, December 23, 2024

ఓట్ల చీలిక ఎవరికీ ప్రమాదం, ఎవరికీ ప్రమోదం

- Advertisement -
- Advertisement -

ఒక్క ఓటు చేజారకుండా ప్రతి అభ్యర్థి కృషి
స్వతంత్య్ర, రెబల్, చిన్న పార్టీల అభ్యర్థులతో ఓటు బ్యాంకుకు గండి
ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కలవరం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. మరో ఆరురోజుల్లో పోలింగ్, పదిరోజుల్లో ఫలితాలు వెలువడనుండడంతో ఈ ఓట్ల చీలిక ప్రధానాంశంగా తయారయ్యింది. ప్రతి అభ్యర్థికి ఓటరు కూడా ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు ఉన్నారు. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటు చేజారకూడదని ఆశిస్తారు. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం. ఈ విషయం అర్థమైన పార్టీలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టెన్షన్ పడుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంకు కొంత ఉంటుంది. వీళ్లు, అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు. ఆ పార్టీలో తిరిగే కార్యకర్తల నుంచి, సానుభూతిపరుల వరకు ఈ కేటగిరీలోకి వస్తారు. ఈ ఓట్లకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎటొచ్చీ, సమయం, సందర్భాన్ని అనుసరించి, ప్రస్తుత సమస్యలు, ప్రస్తుత అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా ఓటు ఎవరికీ వేయాలో డిసైడ్ చేసుకునే ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్లే గెలుపోటములను డిసైడ్ చేయటంలో కీలకంగా మారుతున్నారు. వీళ్లను ప్రసన్నం చేసుకోవటానికి పార్టీలన్నీ తంటాలు పడుతుంటాయి.
మెజార్టీ తగ్గే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్,బిజెపిల మధ్య ప్రధానంగా పోరు నడుస్తోంది. కానీ, ఈ మూడు పార్టీలకు తోడు అనేకమంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఏదైనా సమస్యను ప్రజల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పోటీ చేసే అభ్యర్థులు కొందరున్నారు. అదే సమయంలో గెలవకపోయినా, తమ బలాన్ని నిరూపించుకోవాలని చూసే చిన్న పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి.. ఈ అభ్యర్థులంతా కొన్ని వందల నుంచి వేల వరకు ఓట్లను చీలుస్తారు. ఈ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరివి? ఎవరికీ పడాల్సినవి? ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత, నిరుద్యోగులు కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని, గెలుపోటములు తారుమారు అవుతాయని అభ్యర్థులు కలవరపడుతున్నారు.
సంచలనంగా బర్రెలక్క పోటీ
ప్రస్తుతం స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క ఓ సంచలనంగా మారింది..గ్రాడ్యుయేట్ అయిన శిరీష చిన్న వీడియోతో బర్రెలక్కగా మారింది. సామాజిక మాధ్యమాల్లో లక్షలమంది ఫాలోయర్లను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో దిగింది. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఆమెను చూసి అత్యాశతో, అమాయకత్వంతో పోటీ చేస్తోందని పలువురు ఆరోపించారు. కానీ, పది రోజుల్లో ఆమెపై ఉన్న అంచనాలు మారిపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. శిరీష తాను గెలుస్తానన్న నమ్మకంలో ఉంది. అదే సమయంలో ఆమె గెలుపుపై చాలా మందికి నమ్మకం ఉండకపోవచ్చు. కానీ, ఆమె ఇప్పుడు కొల్లాపూర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీలుస్తుందన్న విషయాన్ని మాత్రం అందరూ నమ్ముతున్నారు. ఆ ఓట్లు ఎవరికి పడాల్సినవి? ఎవరి గెలుపోటముల్ని ఆమె తలక్రిందులు చేయబోతోంది. అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరో చోట ఎన్నారై యువతి
బర్రెలక్కతో పాటు, ఇతర నియోజకవర్గాల్లో మరికొందరు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఏళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని గల్ఫ్ కార్మికులు ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు తమ సమస్యలకు గొంతివ్వడానికి అయిదుగురు స్వతంత్రులుగానో, చిన్నపార్టీల అభ్యర్థులుగానో పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా, ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరో చోట ఒక ఎన్నారై యువతి, ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోరులో కనిపిస్తున్నారు. గెలిచినా, గెలవకున్నా, ఒక సమస్యను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఓటు పోరాటాన్ని సాధనంగా భావించి పోటీలో ఉన్నారు. వీరంతా ఎంతో కొంత ఓట్లను సాధించుకోవటం ఖాయం. ఈ అభ్యర్థులు బరిలో లేకుంటే, ఈ ఓట్లన్నీ ప్రధాన పార్టీల్లో ఏదో ఒక దానికి పడే అవకాశం ఉంటుంది.
119 స్థానాల్లో స్వతంత్య్ర అభ్యర్థుల బెడద
కానీ, ప్రస్తుతం చీలిక తప్పదని తేలింది. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రమాదం, ఎవరికీ ప్రమోదం. ఇదే ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఒకటి రెండు స్థానాల్లో ఇలాంటి ప్రమాదం ఉంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ, 119 స్థానాల్లో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, మరికొన్ని చోట్ల సీసిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలు ఇంకా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండడంతో మొత్తంగా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎవరికీ కనిపించకుండా దెబ్బకొడుతుందో త్వరలో తేలనుంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News