ఖమ్మం : క్రీడలు ఐక్యతను చాటుతాయని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. గురువారం జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుండి చేపట్టిన ఒలింపిక్ పరుగును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్, తాను కూడా క్రీడా జ్యోతిని చేతబూని ఒలింపిక్ రన్‌లో భాగస్వాములయ్యారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాoక్ బండ్ వరకు ఒలింపిక్ రన్ కొనసాగింది.
విద్యార్థిని, విద్యార్థులు, క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొన్నారు. రన్ ముగింపు అనంతరం లకారం బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు దేశాల మధ్య వైషమ్యాలను తగ్గిస్తాయన్నారు. దేశాలుగా, మతాలుగా, భాషలుగా వేరుపడినప్పటికి, దేశాలను ఏకం చేయడానికి క్రీడలు ఒక సాధనంగా ఉపయోగపడతాయన్నారు. క్రీడలను ఒక వృత్తిగా తీసుకొని, కష్టపడి సక్సెస్ అయితే, అదే జీవనాధారం అవుతుందని ఆయన తెలిపారు.
ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్ లాంటి ఆటలు తీసుకుంటే, వ్యక్తిగతంగా ఒకే ఆటగాడు 5 నుండి 6 మెడల్స్ సాధించవచ్చని, ఈ దిశగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి యం.పరంధామ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు క్రిస్టఫర్, రఘునందన్, ఎండి. మతీన్, సాంబమూర్తి, ఉప్పల్ రెడ్డి, జే.శ్రీనివాస్, ఆదర్శ్ కుమార్, కోచ్‌లు, పిఇటిలు తదితరులు పాల్గొన్నారు.