Friday, November 15, 2024

టార్గెట్ ఒలింపిక్స్

- Advertisement -
- Advertisement -

2036 విశ్వక్రీడలను దృష్టిలో పెట్టుకొని నూతన క్రీడా విధానం 

స్కిల్ వర్శిటీ తరహాలోనే పిపిపి
మోడల్‌లో స్పోర్ట్ వర్శిటీ
గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో
విశ్వవిద్యాలయం స్పోర్ట్
వర్శిటీలో 13 రకాల కోర్సులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను
గుర్తించి చదువులకు ఆటంకం
లేకుండా శిక్షణ నూతన
ముసాయిదాపై అధికారులతో
సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్ పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని ఆయన చెప్పారు. అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, క్రీడలు, యువజన అభ్యున్నతి శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సిఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించారు.

అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలి

వివిధ ఆటల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అనుసరించాల్సిన అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్ యూనివర్సిటీని పిపిపి మోడల్‌లో నిర్వహించాలన్నారు. ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సిఎం రేవంత్ సూచించారు. స్పోర్ట్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్ హబ్ లో పొందుపరిచామన్నారు.

గచ్చిబౌలి స్పోర్ట్ స్టేడియం ప్రాంగణంలో

గచ్చిబౌలి స్పోర్ట్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్ యూనివర్సిటీని ప్రారంభించాలని సిఎం అధికారులకు సూచించారు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని సిఎం సూచించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలను స్పోర్ట్ హబ్ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్ స్కూల్, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటి వాటిని గుర్తించి ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని సిఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించటం నుంచి వారికి చదువులకు ఆటంకం లేకుండా అటు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లను పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యం ఇవ్వాలి

మన ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులతో పాటు మన ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని సిఎం రేవంత్ అప్రమత్తం చేశారు. దేశ, విదేశాల్లో ఉన్న కోచ్‌లను రప్పించాలని, అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంఓయూలు చేసుకోవాలని సిఎం చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి, ఎవరికీ ఉద్యోగం ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులను సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News