తిరువనంతపురం: శబరిమలలోని అయ్యస్వామి ఆలయంలో రానున్న పవిత్ర మండలం-మకరవిళక్కు మాసంలో స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం స్పాట్ బుకింగ్ స్లాట్లను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యుడిఎఫ్ కేరళ ప్రభుత్వాన్ని బుధవారం కోరింది. ఆన్‌లైన్ విధానానికే బుకింగ్ స్లాట్లను పరిమితం చేయడం, రోజుకు 80,000 మంది భక్తులకు మాత్రమే స్వామి దర్శనాన్ని కల్పించడం వల్ల వేలాదిమంది భక్తులకు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కంప్యూటర్‌జ్ఞానం లేని భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ బుధవారం శాసనసభలో ప్రభుత్వానికి విన్నవించారు. 41 రోజుల మండల దీక్ష ముగించుకుని శబరిమల యాత్ర కోసం వచ్చే భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ స్టాల్ లభించని పక్షంలో ఆలయంలో స్వామివారి దర్శనభాగ్యం లభించదని, ఇది రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలకు దారితీయగలదని ఆయన చెప్పారు.
ఈ యాత్రా సీజన్‌లో స్పాట్ బుకింగ్ స్లాట్లను అనుమతించే విషయాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించాలని ఆయన కోరారు. కాగా, ప్రతిపక్ష వాదనను దేవస్థానం శాఖ మంత్రి విఎన్ వాసవన్ వ్యతిరేకించారు. శబరిమల ఆలయంలో రోజుకు కేవలం 80,000 మంది భక్తులకు మాత్రమే దర్శనాన్ని పరిమితం చేయాలని, ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే అనుమతించాలని అక్టోబర్ 5న ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించామని ఆయన చెప్పారు.
గత ఏడాది స్పాట్ బుకింగ్‌ను అనుమతిచడంతో భక్తుల సంఖ్య 80,000 దాటి భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని వాసవన్ తెలిపారు. ఈ కారణంగానే రోజుకు 80,000 మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని, ఆన్‌లైన్ బుకింగ్‌ను మాత్రమే అమలుచేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం వల్ల భక్తులు తమ యాత్రా మాగాన్ని ఎంపిక యేసుకుని అవకాశం కూడా ఉంటుందని ఆయన వివరించారు.