మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజాన్ని చైతన్యపరచటంలో అత్యంత కీలక పాత్ర పోషించే జర్నలిస్టులు తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. తప్పుడు సమాచారం వల్ల సమాజానికి కలిగే ముప్పు పట్ల అవగాహనతో పాటు ప్రధాన స్రవంతి రిపోర్టింగ్ చేసే జర్నలిస్టులంతా తప్పుడు సమాచార కథనాలను, తొలగించే ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. “కౌంటరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి యుఎస్ కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన 30 మంది తెలుగు జర్నలిస్టులకు ఒయు సిఎఫ్‌ఆర్‌డిలో ఉపకులపతి రవిందర్ యాదవ్‌తో కలిసి జెన్నిఫర్ లారెన్స్ సర్టిఫికెట్లు అందజేశారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వ్యక్తులు ఎప్పుడూ నిద్రానంగా ఉంటారని, అలాంటి సమాచారాన్ని ప్రజలకు చేరకముందే నిరోధించడంలో జర్నలిస్టులు ముందువరుసలో నిలుస్తారని అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవటం అత్యవసరమని వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించటం, అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన మెళుకువలను తెలుగు జర్నలిస్టులకు అందించే శిక్షణకు గాను యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం పట్ల ఉపకులపతి ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
అకడమిక్, విద్యాపరమైన అంశాలపై వస్తున్న తప్పుడు వార్తలు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నాయో ఆయన వివరించారు. తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో మొదటిసారిగా ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని తెలుగు జర్నలిస్టుల నుంచి అనూహ్య స్పందన స్పందన వచ్చిందని ఒయు జర్నలిజం విభాగాధిపతి, ప్రాజెక్టు సమన్వయకర్త ప్రొఫెసర్ స్టీవెన్ సన్ కోహీర్ అన్నారు. శిక్షణ నిచ్చిన సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ఇతర అధ్యాపకుల కృషిని అభినందించారు.