Monday, December 23, 2024

రైతులను నట్టేట ముంచుతున్నబిజెపి సర్కార్:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట  : వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల్లో ధైర్యాన్ని నింపి ఒక్కోక్క ఎకరానికి రూ. 10 వేల ఆర్థ్ధికంగా అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో 763 మంది రైతులకు సబ్సీడి కింద మంజూరైన స్ప్రింక్లర్లను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సిఎం కెసిఆర్ రైతు బిడ్డ కాబట్టే నిరంతరం రైతుల గురించి ఆలోచించి అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇటీవల ఖమ్మం, వరంగల్ జిల్లాలో పర్యటించిన కెసిఆర్ అక్కడి రైతుల్లో మనోధైర్యాన్ని నింపి ఆర్థ్ధిక సాయాన్ని అందిస్తే రూ. 10 వేలు సరిపోతాయా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడడం సిగ్గు చేటన్నారు.

బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించి ఒక్కోక్క రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తరహాలోనే రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని సవాల్ విసిరారు. నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను నట్టేట ముంచుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ కాదా అని ప్రశ్నించారు. రైతుల ఆందోళనలకు దిగి వచ్చిన కేంద్రం చెంపలు వేసుకుంటూ తిరిగి రైతులకు తీవ్ర ఆన్యాయానికి గురి చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 97 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే ఒక్క తెలంగాణలో మాత్రం 56 లక్షల ఎకరాలలో వరి సాగు జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ పట్టుదల, కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తయి గోదావరి జలాలు రావడంతోనే రాష్ట్రంలో ఎటు చూసిన పచ్చటి పంట పోలాలే దర్శనమిస్తున్నాయన్నారు. నదికి కొత్త నడక నేర్పింది సిఎం కెసిఆరేనని కొనియాడారు.

రైతుల కోసమే నిరంతరం రాష్ట్ర సర్కార్ పని చేస్తుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతుబందు, రైతుభీమా లాంటి పథకాలను అందించడంతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్, గోదావరి జలాలు అందిస్తుంది సిఎం కెసిఆరే అన్నారు. రాష్ట్రంలో పండిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర సర్కార్ మొండికేస్తుందని అయినా సిఎం కెసిఆర్ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారని గుర్తు చేశారు. రైతులను అన్ని విధాలుగా అండగా నిలవడంతోనే వారిలో ఎంతో ఆత్మ విశ్వాసం కలిగిందన్నారు. ప్రక్క దేశం నేపాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు సైతం వరి నాట్లు వేయడానికి తెలంగాణకు వలస వస్తున్నారన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో రైతులకు తెలంగాణ తరహా ఏ ఒక్క పథకానైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

సిఎం కెసిఆర్ రైతుల కోసం చేస్తున్న కృషిని చూసి బిజెపి, కాంగ్రెసోళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రైతులకు ఏమి చేసిందో చెప్పాలన్నారు. స్ప్రింక్లర్లపై సైతం జిఎస్టి విధించడంతో పాటు డీజిల్ రేట్లను పెంచిన ఘనత కేంద్ర సర్కార్‌కే దక్కుతుందన్నారు. గతంలో విద్యుత్ సరఫరాలో తాత్కాలికంగా సమస్య ఏర్పడితే వెంటనే స్పందించిన సిఎం కెసిఆర్ విద్యుత్‌ను ఎంత ధర అయినా కొనుగోలు చేసి రైతులకు కోత లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని అదేశించారని దీంతో అప్పటికప్పుడే విద్యుత్ కొనుగోలు చేసి నిరంతరంగా సరఫరా చేస్తున్నామన్నారు. బాయిల కాడ మీటర్లు పెట్టాలని లేకుంటే రాష్ట్రానికి రావల్సిన 30 వేల కోట్లను ఇవ్వమని కేంద్ర సర్కార్ పట్టుబట్టిందన్నారు.

అయినా రైతుల ప్రయోజనాలే ముఖ్యమంటూ కెసిఆర్ 30 వేల కోట్లు తీసుకోకుండానే రైతులకు అండగా నిలిచారన్నారు. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో ఏ ఒక్క గుంట సైతం ఎండిపోవడం లేదన్నారు. శివుని నెత్తిలో నుంచి జలదార వచ్చిన తరహాలోనే కాళేశ్వరం జలాలు పంట పొలాలకు పారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రామలక్ష్మి, ప్రజాప్రతినిదులు నాయకులు మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, కూర మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, మారెడ్డి రవీందర్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, గంప రాంచందర్‌రావు, కనకయ్య, బాలమల్లు, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News