మాస్కో : రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెల్టాతోపాటు కరోనా అన్ని వేరియంట్లపై సమర్ధంగా ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయా నేషనల్ రీసెర్చి సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ , రష్యన్‌డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఎఫ్)ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను మొదట చైనా లోని వుహాన్‌లో బయటపడిన వైరస్ స్ట్రెయిన్ ఆధారంగా తయారు చేశారు. కానీ ఇప్పుడు పుట్టుకొస్తున్న డెల్లా, ఆల్ఫా, బీటా, గామా తదితర అత్యంత ప్రమాదకర వేరియంట్లను తటస్థీకరించడంలో స్పుత్నిక్ వి బాగా పనిచేస్తున్నట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్‌డిఐఎఫ్ వెల్లడించింది. ఈమేరకు స్పుత్నిక్ వి టీకా తీసుకున్న వారి రక్త నమూనాలను సేకరించి పరిశీలించింది. మిశ్రమ విధానం (కాక్‌డైల్ అప్రోచ్) లో రెండు డోసులను భిన్న రకాలుగా తయారు చేయడంతో స్పుత్నిక్ వి అన్ని టీకాలలో అగ్రగామిగా నిలుస్తోంది.
ఈ టీకా వల్ల ప్రేరేపితమయ్యే రోగ నిరోధక ప్రతిస్పందనలు కొత్త వేరియంట్లను తటస్థీకరిస్తున్నట్టు గమలేయా ఇనిస్టిట్యూట్ సర్వేల్లో తేలింది. సజీవ వైరస్‌లను వినియోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. ఇలాంటి అధ్యయనాలు కొత్త వేరియంట్లపై మరిన్ని చేపడతామని దిమిత్రివ్ స్పష్టం చేశారు. భారత్ సహా మొత్తం 67 దేశాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిజిస్టర్ అయింది. భారత్‌లో ఈమధ్యే ఈ వ్యాక్సిన్ వినియోగించడం ప్రారంభమైంది. భారత్‌లో మరో 50 నగరాల్లో ఈ టీకాను అందుబాటు లోకి తీసుకు వస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, మిర్యాల గూడ, విశాఖపట్నం, విజయవాడల్లోనూ అందుబాటులో ఉన్నట్టు తెలియచేసింది. త్వరలో భారీ స్థాయిలో పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.