Sunday, January 19, 2025

శ్రీశ్రీ మహాప్రస్థానం నాడు నేడు..!

- Advertisement -
- Advertisement -

నెత్తురు కన్నీళ్ళు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని మంటలుగా మార్చడం అతనికే తెలిసిన విద్య ఎందుకంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ అన్న చలం వాక్యాలు శ్రీశ్రీ కి అక్షరాల వర్తిస్తాయి. ఒక కవి లేదా మేధావి జీవించిన కాలంలో తన చుట్టు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసి ఎంత బలంగా ప్రభావితం అవుతాడో చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి వారిలో శ్రీశ్రీ కూడా అందుకు మినహాయింపు కాడు. బాల్యంలోనే (8వ యేటనే) కంద పద్యం రాసి తన గురువులను ఆశ్చర్యపరిచాడు.

ఇంటర్మీడియట్ అనంతరం ప్రభవ కావ్యం రాసి ప్రచురించి పండితుల మెప్పు పొందాడు. అలాగే సుప్తాస్తికలు, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిప్రాలి, చరమ రాత్రి కథలు, జయభేరి మొదలైన రచనలు చేసినప్పటికీ శ్రీశ్రీ అంటే మహా ప్రస్థానం. మహా ప్రస్థానం అంటే శ్రీశ్రీ అనేంతగా తెలుగు సాహిత్యంలో బలంగా నాటుకుపోయింది. దీనిని తన ఆప్త మిత్రుడైన కొంపెల్ల జనార్ధన్ రావుకి అంకితం ఇచ్చి స్నేహానికి తను ఇచ్చే విలువ ఏమిటో చాటి చెప్పాడు ఈ తరానికి. ఆనాటి ప్రపంచ పరిణామాలు, సమాజపు స్థితిగతుల్ని ఆకలింపు చేసుకుని ఎలా స్పందించాడో మహాప్రస్థానంలో ప్రస్తావించిన అనేక చారిత్రక అంశాలు చదివితే అర్ధం అవుతుంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీశ్రీ 1928-31 సంవత్సరాల మధ్య బి.ఏ. (B.A) పాసయ్యాడు. తరగతి గదిలో చదివిన చరిత్ర పాఠాలు మరియు ఎక్కువగా ఇష్టమైన పుస్తక పఠనం వల్ల తెల్సుకొన్న ప్రపంచ పరిణామాల ఫలితంగా శ్రీశ్రీ ని అభ్యుదయపు ఆలోచనల వైపు నడవడానికి బాటలు వేశాయి. అభ్యుదయ భావజాలానికి కొనసాగింపుగా రాసినదే మహాప్రస్థానం. తెలుగు సాహిత్యంలో పెను సంచలనం అది. ఒక కాలంలో జీవించి రాబోయే కాలం గూర్చి కలలు కనటం కవికి సహజమే అయినా, శ్రీశ్రీ ఊహించిన ప్రపంచం, ప్రయాణించిన కలల లోకం ఎవరు చేరుకోలేరు అనటం అతిశయోక్తి కాదు. స్వయంగా నేనొక దుర్గం! నాదొక స్వర్గం! అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అంటాడు.

ఎత్తైన దుర్గంపై నిలబడి ప్రపంచం మొత్తాన్ని వీక్షించగలిగాడు కాబట్టే మహాప్రస్థానం అతని కలం నుండి జాలువారింది. నాటి నుండి నేటి వరకు అందులో ప్రస్తావించిన కవిత్వాంశాలు ప్రపంచంలోని ఏదో ఒక మూలన ప్రస్తుతం జరగటం వారి భవిష్యత్ ఊహాశక్తికి, కల్పనా చాతుర్యానికి, వాస్తవిక దృక్పదంతో కూడిన ఆలోచనను ఎంత పొగిడిన తక్కువే. ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, విప్లవాలు, 1914 నుండి 1919 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో శ్రీశ్రీది శైశవ దశ. 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 29 సం.రాల యువకుడు. అదేవిధంగా లెనిన్ నాయకత్వంలో రష్యా విప్లవం (1917) గాంధీజీ నేతృత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, మావో నేతృత్వంలో చైనాలో ప్రజల తిరుగుబాట్లు (1947) మరియు క్యూబాలో ఫెడెల్ కాస్ట్రో, చెగువేరా నాయకత్వంలో తిరుగుబాట్లు జర్మనీలో నాజీజం, ఇటలీలో ఫాసీజం మొదలైనవి.

ఒక జాతిని పీడిస్తున్న మరొక జాతి నుండి బంధ విముక్తున్ని చేయడానికి తనే స్వయంగా పీడిత జాతిని ముందుకు నడిపించడానికి సమరగీతిపూరిస్తూ సమర శంఖం ఊదుతాడు, పెట్టుబడిదారుడు శ్రామికులను దోచుకోవటం కళ్ళారా చూసి చలించి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి సమసమాజ స్థాపన జరగాలని కాంక్షించాడు. దోపిడి వ్యవస్థ పతనం అయితే, వర్గ రహిత సమాజం సాధ్యమౌతుందని అందుకే అందరం కొత్త ప్రపంచ వైపు గొప్ప ప్రయాణం చేద్దామని ఆ ప్రయాణంలో ముందుకు నడవని యువతను, వారి సోమరితనాన్ని ఎండగడుతూ (ఎముకలు కుళ్ళిన
వయస్సు మళ్ళిన సోమరులారా చావండి) సామ్యవాద సమాజ స్థాపన వైపు అడుగులు వేద్దామని అలాంటి ప్రయాణమే చేద్దామని మహాప్రస్థానం శీర్షికతో ఉన్న కవితలో గొంతెత్తి చాటుతాడు.దేశ చరిత్రలు కవితలో శ్రీశ్రీ అదే ప్రస్తావిస్తు నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం, రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదికినా దొరకదు అంటాడు.

ఆదిపత్యం కోసం ఒకరు, స్వేచ్చా వాయువులు ఆస్వాదించటానికి మరొకరు ఫలితంగా ఏర్పడిన సంఘర్షణ, ఇవన్ని ఒక ఎత్తు అయితే మహా ప్రస్థానంలోని కవితలు 1933 నుండి 1947 మధ్య కాలంలో రాశాడు. ఇది మొదటిసారిగా ముద్రించబడిన సంవత్సరం 1950 నేటికీ 74 సంవత్సరాలు ఈ డ్బ్బై నాలుగు సంవత్సరాల కాలంలో మనిషి ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణకు గురౌతూనే ఉన్నాడు. అందుకే ఇక్కడ శ్రీశ్రీ నాటి నుండి నేటి వరకు సాహితీ వినీలాకాశంలో దృవతారగా వెలుగొందటానికి కారణం భవిష్యత్తును గూర్చి ఊహించిచెప్పటం, గత చరిత్రను కావ్య రూపంలో కళ్ల ముందుంచి మానవుడి రక్త చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయటం గొప్ప విషయం.ఇందులోనే మరోచోట ఇలా అంటాడు కధలన్ని కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అని దేన్ని దాచలేo ప్రపంచమంతా గ్రామంగా మారిన వేల ప్రపంచీకరణ వల్ల మానవ వికాసం జరిగి ప్రపంచం నలుమూలల ఏ సంఘటన జరిగినా వెంటనే కళ్ళముందు ప్రత్యక్షం కావటం మనం చూస్తున్నదే, అందుకే మహా ప్రస్థానంలో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం నేటికీ మనిషి చుట్టూరా జరుగుతున్న విద్వాంసాలు ముందే ఊహించి చెప్పాడు.

ఆదిమానవుడు అభద్రతతో, ప్రకృతితో, పరిస్థితులతో, కాలమార్పులతో పోరాడుతూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటే ఆధునిక మానవుడు ఆదిపత్యం కోసం పొరుగు దేశాలపై పోరు కొనసాగిస్తున్నాడు ఫలితంగా వ్యక్తి స్వేచ్ఛ ప్రశ్నార్ధకం. ప్రస్తుతం ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనవి. ఉక్రెయిన్ దేశంలోని సాధారణ పౌరులు, గాజా లోని సాధారణ పౌరుల మానసికస్థితి ఏమిటి? ఏక్షణం ఏ బాంబు ఎక్కడి నుండి వచ్చి పడుతుందో, రేపటి ఉషోదయం వారిని ఎలా పలకరిస్తుందో అనే భయం గుప్పిట్లో గడుపుతూ ఉండడం బాధ కల్గించే అంశం. యుద్ధం వల్ల చిద్రం అయిన బాల్యం, ప్రశ్నార్ధకం అవుతున్న మానవుడి స్వేచ్ఛ? ఎటువైపు ఈ పయనం ఏ యుద్ధం ఎందుకు జరుగుతోందో? తెలియని అమాయకత్వం ఆ దేశ ప్రజలది. అందుకే సాటి మనిషి పట్ల హింసను, తోటి మనిషిపై అజమాయిషి చెలాయించాలనుకోవటం దాని ద్వారా వచ్చే సంఘర్షణను ఊహించలేకపోవటం నా దృష్టిలో అజ్ఞానమే, మానవ శ్రేయస్సును కోరని ఏ పాలకుడైనా ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మనుగడ కొనసాగించ లేదు కూడా.

శ్రీశ్రీ ప్రభావం తెలుగు సాహిత్యంపై బలమైన ముద్రనే వేసింది. తనే స్వయంగా ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకోవడం ఆత్మ విశ్వాసమే తప్ప మరొకటి కాదు. ఆరుద్ర, తిలక్, శేషేంద్రశర్మ, సినారె, కుందుర్తి, కాళోజీ, సోమసుందర్, అనిశెట్టి, గంగినేని వెంకటేశ్వర్ రావు, గజ్జెల మల్లారెడ్డి, బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ, శ్రీరంగం నారాయణ బాబు, కాళోజీ, అజంత, బైరాగి, భోయిభీమన్న లాంటి కవుల సాహిత్యం చదివితే శ్రీశ్రీ ప్రభావం వారిపై ఎంతగా వుందో అర్ధమైపోతుంది. అదేవిధంగా స్త్రీవాద కవులపై, దళితవాద కవులపై, మైనార్టీ వాద, దిగంభర కవులపై అమితంగా ప్రభావం చూపింది శ్రీశ్రీ అభ్యుదయపు ఆలోచనలే. ప్రశ్నించేతత్వం అనేది శ్రీశ్రీ నుండే (అంతకు ముందే ఉన్నప్పటికీ) తెలుగు సాహిత్యంలో పతాక స్థాయికి చేరిందని చెప్పడంలో సందేహం లేదు. తాను జీవించిన కాలంలోనే (1910 ఏప్రిల్ 30, 1983 జూన్ 15) అనేక రకాల సంఘర్షణలను చూసి చలించి ఒక కొత్త ప్రయాణం మనిషి చేయాలని అది గొప్పగా ఉండాలని ఎలాంటి సంఘర్షణలు లేనిదై మానవ కళ్యాణానికి ఉపయోగపడాలని అలాంటిమార్గం వైపు పయాణించాలని స్వాతంత్య్రం, సమభావం, సౌభ్రాతృత్వం, సౌహార్ధం కలగాలని ఈ స్వప్నం నిజమౌతుంది, ఈ స్వర్గం ఋజువవుతుంది అంటాడు.

అలాంటి రోజులే ముందు ముందు రావాలని, మనిషి స్వేచ్ఛగా అన్నిచోట్ల సంచరించాలని ప్రపంచమంతా ఎలాంటి సంఘర్షణలు లేని సమసమాజాన్ని సృష్టించుకొని మానవ వికాసానికి మంచి సోపానాలు నిర్మించుకొని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తాడు. శ్రీశ్రీది ఓ సాహిత్య చరిత్ర శ్రీశ్రీ ముందు వెనకాల అనేంతగా ప్రభంజనం సృష్టించాడు. తెలుగు సాహిత్యంలో సునామివలే విజృంబించి, కృష్ణశాస్త్రి అడవులలో విహరిస్తే శ్రీశ్రీ నిర్భాగ్యుల ఆకలికేకలు, కార్మికుల శ్రమ విలువను గుర్తించాడు. కవిత్వమంటే యతి ప్రాసలు, అలంకారయుతంగా ఉండాలనే నిబంధనను ప్రక్కనపెట్టి కాదేది కవితకనర్హం అంటూ వచన కవిత్వానికి కొత్త భాష్యం చెప్తూ, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల, తలుపుగొళ్ళెం, హారతి పళ్ళెం అన్ని కవితా వస్తువులే అంటూ వచన కవిత్వానికి కొత్తదారులు వేసిన శ్రీశ్రీ ఈ కాలం వర్ధమాన కవులకు, రచయితలకు నిజంగా ఓ చక్కని టానిక్ లాంటివాడే. ఆ టానిక్ ను ఆరగించి శ్రీశ్రీ ని ఆవాహన చేసుకుంటే ప్రతీ కవి సర్వకాల, సర్వావస్థలయందు సర్వరోగ నివారిణిగా ఉండొచ్చు. కవి అనే వాడు దీనుల వైపు, పీడితులవైపు ఉండాలని సమాజ సంక్షేమం వైపు, వ్యక్తి స్వేచ్చ వైపు నిలబడి పాలకులను ప్రశ్నించాలంటాడు. అందుకే శ్రీశ్రీ మహా కవి అయ్యాడు.

డా.మహ్మద్ హసన్
9908059234

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News