న్యూఢిల్లీ : కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ రాజకీయ ప్రవేశంతో ఉండే ప్రభావం నామమాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపి శశిథరూర్ చెప్పారు. అసలు రాష్ట్రంలో బిజెపి ప్రధాన పోటీదారే కాదని, ఇక శ్రీధరన్ రాకతో ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఆయన పెద్ద టెక్నోక్రాట్ ఇది నిజమే కానీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చక్రం తిప్పడం అసాధ్యమైన పని అని తేల్చిచెప్పారు. కేరళలో బిజెపి బలమెంత? కొన్ని స్థానాలలో కొంత మేరకు ఇప్పుడిప్పుడే తన ప్రభావం చూపుతుందని భావించాల్సి ఉంటుందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో అతి కష్టం మీద బిజెపికి ఒక్కసీటు దక్కింది. అయితే ఇప్పుడు ఈ సంఖ్యాబలాన్ని పెంచుకోవడం బిజెపికి దుర్లభమే అవుతుందని థరూర్ తెలిపారు. బిజెపిలో ఆయన చేరడమే ఆ పార్టీకి సంబంధించిన పెద్ద విషయం అవుతుంది. అంతేకానీ దీనితో రాష్ట్రంలో బిజెపి బలం పెరగడం, పార్టీ పరుగులు తీయడం కుదరదని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా మెట్రోరైలు విస్తరణలో ప్రఖ్యాతమైన శ్రీధరన్ రాజకీయాలలో చేరడమే తనకు ఆశ్చర్యం కల్గించిందని, ఇక అందులోనూ బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించడం మరింత కంగుతిన్పించిందన్నారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నిర్వహణ, అమలుకు సంబంధించి ఆయన పేరొందారు. ఉన్నట్లుండి రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేయడం బహుశా తనకే కాకుండా పలువురికి ఆశ్చర్యం కల్గించి ఉండొచ్చునని అన్నారు. టెక్నోక్రాట్‌గా ఆయనకు దీర్ఘకాలిక అనుభవం ఉందన్నారు. ఘర్షణాయుత రాజకీయాలలో ఇంతవరకూ నిర్ణయాత్మక పాత్రలో లేకుండా ఉన్న వ్యక్తి విభిన్న ప్రపంచం వంటి రాజకీయ రంగానికి రావడం ఆశ్చర్యపరిచే అంశమే అవుతుందన్నారు.
తాను 53వ ఏట రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు , దీనిని ప్రభావితం చేయలేని దశలో చేరానని తరువాత తెలిసిందని, ఇక 88 ఏండ్ల వయస్సున్న వ్యక్తి నిర్ణయం గురించి తానేమి చెప్పగలనని ప్రశ్నించారు. శ్రీధరన్ రాజకీయ రంగ ప్రవేశంతో కేరళలో త్రిముఖ పోటీ వాతావరణం ఏర్పడుతుందా? అనే ప్రశ్నకు స్పందించారు. కేరళలో ఆది నుంచి ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌ల ఆధిపత్య పోరు ఉందన్నారు. కొత్తగా బిజెపి రాష్ట్రంలో తన ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు. అసలు కేరళ గురించి బిజెపి తీవ్రస్థాయిలో ఆలోచించడమే లేనప్పుడు దీని ప్రభావం గురించి, పార్టీలోకి శ్రీధరన్ రావడం గురించి ఏమి చెపుతారని అన్నారు. ఉన్న ఒక్కసీటు నుంచి ఎక్కువ సీట్ల దశకు చేరడం ఆ పార్టీకి కష్టమే అవుతుందన్నారు.