నేడు చెన్నైతో పోరు
చెన్నై: వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇరు జట్లు కూడా ఈ సీజన్‌లో చెత్త ఆటతో సతమతమవుతున్నాయి.ఇరు జట్లు ఇప్పటికే చెరో 8 మ్యాచ్‌లు ఆడాయి. అయితే ఇరు జట్లు కూడా కేవలం రెండేసి మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. పాయింట్ల పట్టికలో రెండు జట్లు చివరి వరుసలో నిలిచాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రెండు జట్లు నాకౌట్‌కు అర్హత సాధించడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. ఎలాగో ప్లేఆఫ్ అవకాశాలు సన్నగించడంతో మిగిలిన మ్యాచుల్లోనైనా ఒత్తిడి లేకుండా ఆడి విజయాలు సాధించాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కీలక ఆటగాళ్లు బ్యాట్‌ను ఝులిపించడంలో విఫలమవుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు జట్టుకు శుభారంభం అందించలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరు వరుస పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నారు. ముంబైతో జరిగిన మ్యాచుల్లో ఇద్దరు కూడా విఫలమయ్యారు. ఇక వన్‌డౌన్‌లో వస్తున్న ఇషాన్ కిషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. భారీ ఆశలు పెట్టుకున్న ఇషాన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం తప్పిస్తే మిగతా పోటీల్లో పూర్తిగా తేలిపోయాడు. వరుసగా ఏడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశ పరిచాడనే చెప్పాలి. ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప అతను పెద్దగా జట్టుకు అండగా నిలిచింది లేదు. కిందటి మ్యాచ్‌లో కూడా పూర్తిగా చేతులెత్తేశాడు. అనికేత్ వర్మ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఒక్క క్లాసెన్ మాత్రమే నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. అతను తప్పిస్తే మరే బ్యాటర్ కూడా జట్టును ఆదుకోవడంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్‌లో కూడా హైదరాబాద్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. కీలక బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ సీజన్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ బౌలింగ్‌ను కనబరచలేక పోయాడు. ఇది కూడా జట్టు ఓటములకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఇలాంటి స్థితిలో చెన్నైతో జరిగే పోరు హైదరాబాద్‌కు సవాల్‌గా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా సన్‌రైజర్స్ విజయం సాధిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.
సవాల్ వంటిదే..
మరోవైపు చెన్నైకి కూడా ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఒకప్పుడూ ఐపిఎల్‌ను శాసించిన సిఎస్‌కె ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశ పరిచింది. ఆరు ఓటములతో చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి స్థితిలో హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది. కీలక ఆటగాళ్ల వైఫల్యం చెన్నైకి ప్రతికూలంగా మారింది. రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, అయుష్ మాత్రె, జడేజా, శివమ్ దూబె, విజయ్ శంకర్, కెప్టెన్ ధోనీ వంటి స్టార్లు ఉన్నా జట్టుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ ఆటతో జట్టుకు అండగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరు సత్తా చాటితేనే చెన్నైకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.