నేడు విశాఖలో ఢిల్లీతో పోరు
విశాఖపట్నం: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో ఢిల్లీతో జరిగే పోరు హైదరాబాద్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది. ఇక తొలి పోరులో లక్నోను ఓడించిన ఢిల్లీ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీ సమతూకంగా ఉంది. దీనికి తోడు చాలా రోజులుగా విశాఖలోనే ప్రాక్టీస్ చేస్తుండడం కూడా ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా మారింది.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఢిల్లీ ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లక్నోపై అశుతోష్ శర్మ, విప్రాజ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ఈ మ్యాచ్‌లో వీరు ఢిల్లీని గెలిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
డుప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్ తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ చాల బలంగా ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో మెక్‌గుర్క్, అభిషేక్, కెప్టెన్ అక్షర్ పటేల్, రిజ్వీ తదితరులు విఫలమయ్యారు. ఇది ఆందోళన కలిగించే అంశమే. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ముకేశ్ కుమార్, కుల్దీప్, స్టార్క్, అక్షర్, మోహిత్ శర్మ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.